-

58-42 దామాషాలోనే ఎస్‌వో, ఏఎస్‌వోల విభజన

8 May, 2016 02:31 IST|Sakshi

* కమల్‌నాథన్ కమిటీ సూచనను అంగీకరించిన ఇరు రాష్ట్రాల సీఎస్‌లు
* తెలంగాణకు కేటాయించిన వైద్యుల స్థానికత వివరాలు ఇవ్వాలని ఆదేశం

సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల సచివాల యాల్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల విభజన ఓ కొలిక్కి వచ్చినట్టయింది. ఎస్‌వో, ఏఎస్‌వోలను 58-42 దామాషాలోనే విభజించాల్సిందిగా కమల్‌నాథన్ సూచించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ఏపీ, తెలంగాణ సీఎస్‌లు ఎస్పీ టక్కర్, రాజీవ్‌శర్మతో పాటు కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులు పాల్గొన్నారు.

కొంతకాలంగా ఉద్యోగుల విభజన జాప్యం కావడం, ఏపీలో పదవీ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రం విభజించి రెండేళ్లు కావస్తున్నా ఇలాంటి సమస్యలు కొలిక్కి రాలేదు. మరీ ముఖ్యంగా ఏపీ సచివాలయ ఉద్యోగులు అమరావతికి తరలివెళ్లాల్సిన తరుణంలో ఉభయ సచివాలయ శాఖల్లో పనిచేస్తున్న ఎస్‌వో, ఏఎస్‌వోల విభజన ప్రధానంశంగా మారింది.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన సమావేశంలో ఎస్‌వో, ఏఎస్‌వోల విభజన 58-42 దామాషాలోనే పంచుకోవాలని, ఇబ్బందులు తలెత్తితే సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించుకోవాలని సూచించారు. దీనికి ఇరు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించినట్టు తెలిసింది. దీంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల విభజనపైనా చర్చ జరిగినట్టు సమాచారం.
 
పదిరోజుల్లో లోకల్ స్టేటస్ తేల్చండి
ఏపీకి చెందిన 300 మంది వైద్యులను అన్యాయంగా తెలంగాణకు కేటాయించారని తెలంగాణ వైద్యుల సంఘం వ్యతిరేకించిన నేపథ్యంలో.. అలా కేటాయిం చబడిన వారి స్థానికత వివరాలు పదిరోజుల్లో ఇవ్వాలని కమల్‌నాథన్ కమిటీ ఆదేశించింది. ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శనివారం కమల్‌నాథన్ కమిటీ సమావేశం జరిగింది. 4 నుంచి 10వ తరగతి వరకూ చదివిన స్టడీ సర్టిఫికెట్లుగానీ, లేదా నివా స ధృవపత్రాలుగానీ పొందు పరచాలని, ఈ ఆధారాలు ఉంటేనే తెలంగాణకు కేటాయింపు వర్తిస్తుందని అన్నట్టు తెలిసింది. దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివరాలు పదిరోజుల్లోగా ఆన్‌లైన్‌లో పెడతామని హామీ ఇచ్చారని సమాచారం.

మరిన్ని వార్తలు