‘కృష్ణా’ జలాలకు బకాయిల షాక్‌!

14 Apr, 2018 02:17 IST|Sakshi

రూ.573 కోట్లు చెల్లించని జలమండలి

ఇరిగేషన్‌ కార్యాలయాలు, క్వార్టర్లకు కరెంట్‌ కట్‌

సాక్షి, హైదరాబాద్‌: జంట నగరాల తాగునీటి అవసరాలను తీరుస్తున్న కృష్ణా జలాలకు కరెంట్‌ షాక్‌ కొడుతోంది. తాగునీటి అవసరాలకు కృష్ణా జలాలను వినియోగించుకుంటున్న జలమండలి, నీటిని ఎత్తిపోస్తున్న మోటార్లకు అయ్యే కరెంట్‌ చార్జీలను చెల్లించకుండా చేతులెత్తేస్తోంది. సాగర్‌ నుంచి పుట్టంగండి ఎత్తిపోతల ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు నీటిని తరలించి అక్కడినుంచి గ్రావిటీ కాల్వల ద్వారా హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్నారు.

మొత్తంగా 2,400 క్యూసెక్కులు ఎత్తిపోస్తుండగా ఇందులో 525 క్యూసెక్కులు తాగునీటి అవసరాలకు మళ్లిస్తున్నారు. నీటిని ఎత్తి పోసేందుకు నెలకు కనిష్టం గా రూ.10 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు వస్తు న్నాయి.  ఏటా రూ.120 కోట్ల మేర విద్యుత్‌ బిల్లులు వస్తున్నాయి. పదేళ్లుగా వచ్చిన మొత్తం బిల్లు రూ.1,272 కోట్ల మేర ఉండగా ఇందులో తాగునీటి బిల్లు రూ.573 కోట్లు మేర హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్లై అండ్‌ సీవరేజి బోర్డు చెల్లించాల్సి ఉంది.  

పెండింగ్‌ బిల్లులపై...
బిల్లు బకాయిలపై నీటి పారుదల శాఖ పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఆ శాఖే ట్రాన్స్‌కోకు బిల్లులు చెల్లిస్తోంది.  బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరిగితే అక్కంపల్లి పరిధిలోని శాఖ కార్యాలయాలకు, సిబ్బంది క్వార్టర్లకు కరెంట్‌కట్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలో జనవరిలో అధికారులు ప్రభుత్వ సీఎస్‌ జోషి తో సమావేశం నిర్వహించారు. బిల్లుల చెల్లింపునకు జలమండలి అధికారులు ఓకే చెప్పినా బకాయిలు మాత్రం చెల్లించలేదు. దీంతో మళ్లీ రెండ్రోజుల క్రితం  ఇరిగేషన్‌ కార్యాలయాలు, క్వార్టర్లకు ట్రాన్స్‌కో కరెంట్‌ కట్‌ చేసింది.  

మరిన్ని వార్తలు