దేశ ఆర్థిక వ్యవస్థలో కస్టమ్స్ విభాగానిది కీలకపాత్ర

27 Jan, 2016 20:54 IST|Sakshi

- కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్
శంషాబాద్ : దేశ ఆర్థిక వ్యవస్థలో కస్టమ్స్ విభాగానిది కీలక పాత్ర అని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలోని నొవాటెల్ హోటల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘డిజిటలైజేషన్, ప్రొగ్రెసీవ్ మేనేజ్‌మెంట్ థీమ్’తో ముందుకెళ్లాలని డబ్ల్యూసీఓ (వర ల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్) తీసుకున్న నిర్ణయం సమాచార వ్యవస్థతో ముడిపడి ఉందన్నారు. నిజాయితీతో కూడిన పారదర్శకమైన సమాచార పంపిణీ అనేది ఆయా సంస్థల పురోగతిలో ప్రధానమైన పాత్ర పోషిస్తుందన్నారు. కస్టమ్స్ నిబంధనలు, క్లియరెన్స్ తదితర సమాచారం ప్రయాణికులకు చేరువకావాల్సి ఉందన్నారు. వ్యవస్థీకృత అవినీతి కారణంగా దేశభద్రత సవాలుగా మారుతోందన్నారు. డిజిటలైజేషన్ ద్వారా కస్టమ్స్ పనితీరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పన్ను రాబడి తదితర అంశాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

భర్త జీతాలను భార్యలు తెలుసుకుంటున్నారు..
సమాచార హక్కు చట్టం ద్వారా భర్తల జీతాలు ఎంత ఉన్నాయో కూడా భార్యలు తెలుసుకుంటున్న సందర్భాలు చోటు చేసుకుంటున్నాయని మాడభూషి శ్రీధర్ వివరించారు. భార్యాభర్తల మధ్య పరస్పర సమాచారలోపం కారణంగానే ఇలాంటి ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. సమాచారహక్కు చట్టం దేశ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని పలు సందర్భాలను ఆయన ఊటంకించారు. కస్టమ్స్ విభాగంలో ఇప్పటికే డిజటలైజేషన్ ద్వారా సులభతరమైన పనివిధానంతోపాటు పారదర్శకత చోటు చేసుకుంటుందని హైదరాబాద్ క స్టమ్స్ చీఫ్ కమిషనర్ ఆర్.శకుంతల పేర్కొన్నారు. దేశ ఆర్థికరంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కస్టమ్స్ విభాగం పనితీరు కూడా మారుతుందన్నారు. ఈ సందర్భంగా పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్ కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్, అసిస్టెంట్ కమిషనర్లు, ఎగుమతి, దిగుమతి రంగాల్లోని వాణిజ్యవేత్తలు హాజరయ్యారు.

>
మరిన్ని వార్తలు