వృద్ధ దంపతుల్ని నిండా ముంచారు

6 Apr, 2017 02:11 IST|Sakshi
వృద్ధ దంపతుల్ని నిండా ముంచారు

- ఇన్సూరెన్స్‌ పాలసీతో సైబర్‌ నేరగాళ్ల ఎర
- నమ్మి రూ. 70 లక్షలు చెల్లించిన దంపతులు
- రంగంలోకి దిగిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు  


సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన వృద్ధ దంపతుల్ని సైబర్‌ నేరగాళ్లు నిండా ముంచారు. గతంలోనే సరెండర్‌ చేసిన ఇన్సూరెన్స్‌ పాలసీపై బోనస్‌ వస్తుందంటూ ఎర వేశారు. వీరి మాటల వల్లో పడిన వృద్ధ దంపతులు ఏకంగా రూ. 69.73 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై బుధవారం కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తార్నాక ప్రాంతానికి చెందిన వృద్ధ దంపతులు గతంలో ఐసీఐసీఐ బ్యాంకు ఇన్సూరెన్స్‌ పాలసీని సరెండర్‌ చేశారు. 2015 మార్చి నెల్లో వీరికి ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. ఫోన్‌ చేసిన వ్యక్తి అమన్‌ శర్మగా పరిచయం చేసుకుని.. సరెండర్‌ చేసిన పాలసీ నంబర్, వివరాలు చెప్పాడు.

ఆ పాలసీపై బోనస్‌ పాయింట్లు వచ్చాయని, సిల్వర్‌ ప్లాన్‌ కింద రూ. 66 వేలు, గోల్డ్‌ ప్లాన్‌ కింద రూ.78 వేలు పొందే అవకాశం ఉందంటూ నమ్మించాడు. దీంతో ఆశపడిన ఆ దంపతులు ఆసక్తి చూపడంతో సైబర్‌ నేరగాళ్లు అసలు దందా ప్రారంభించారు. ఆయా స్కీమ్స్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవడానికి రూ. 20 వేలు చెల్లించాల్సి ఉంటుందంటూ చెప్పి ఓ బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయించుకున్నారు. వృద్ధ దంపతులు పూర్తిగా తమ వల్లో పడ్డారని నిర్ధారించుకున్న సైబర్‌ నేరగాళ్లు తమ పంథా మార్చారు.

డబ్బు రెట్టింపయ్యే అవకాశముందని..
ప్రత్యేక స్కీమ్‌ నేపథ్యంలో మీరు చెల్లించే ప్రతి రూపాయికీ బోనస్‌ పాయింట్లు పెరుగుతాయని, మొత్తమ్మీద కొన్ని రోజుల్లోనే ఆ డబ్బు రెట్టింపయ్యే అవకాశం సైతం ఉందని నమ్మించారు. ఇలా మోసగాళ్లు వివిధ స్కీముల పేర్లు చెప్తూ దఫదఫాలుగా డబ్బు డిమాండ్‌ చేశారు. వీరి మాయలో పడిపోయిన వృద్ధ దంపతులు పదవీ విరమణతో వచ్చిన డబ్బు, తమ పిల్లలకు చెందిన నగదుతో పాటు మరికొంత మొత్తం అప్పు చేసి మరీ సైబర్‌ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేస్తూ పోయారు. మొత్తమ్మీద ఏడాది కాలంలో రూ. 69.73 లక్షల్ని  బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్‌ చేశారు. 

మోసపోయామని గుర్తించిన బాధితులు సైబర్‌ నేరగాళ్లను ఫోన్‌లో నిలదీయగా బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వారు సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఆ మోసగాళ్లు ఢిల్లీ కేంద్రంగా కథ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. వృద్ధ దంపతులకు ఫోన్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు వీరు సరెండర్‌ చేసిన పాలసీ నంబర్‌ చెప్పడాన్ని పోలీసులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ బ్యాంక్‌నకు చెందిన కాల్‌సెంటర్‌ నుంచి ఈ వివరాలు లీక్‌ అయ్యాయా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

>
మరిన్ని వార్తలు