వాట్సప్ 94906 17444

20 Feb, 2015 23:39 IST|Sakshi

సైబరాబాద్ పోలీసుల ప్రయోగం
నేరాల అడ్డుకట్టకు యత్నం
అందుబాటులోకి కొత్త నెంబర్
పౌర పోలీసు సేవలను ప్రారంభించిన కమిషనర్

 
సిటీబ్యూరో:  అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ... ప్రజల భాగస్వామ్యంతో నేరాలను అదుపు చేసే దిశగా సైబరాబాద్ పోలీసులు మరో అడుగు ముందుకేశారు. ఇందులో భాగంగా వాట్సప్ సేవలను వినియోగించుకోనున్నారు. దీని కోసం సెల్‌ఫోన్ నెంబర్ 94906 17444ను అందుబాటులోకి తీసుకొచ్చారు. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తన కార్యాలయంలో శుక్రవారం దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  పోలీసు సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ నెంబర్ ఉపకరిస్తుందని చెప్పారు. బాధితులు ఎప్పుడైనా వాట్సప్ ద్వారా తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తులు, ట్రాఫిక్ సమస్యలపై పౌర పోలీసులు స్పందించి వాట్సప్ ద్వారా తెలియజేస్తే వెంటనే పోలీసులు స్పందించేందుకు వీలు కలుగుతుందన్నారు. గుర్తు తెలియని మృతదేహాలు లభ్యమైనప్పుడు, మిస్సింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో వాట్సప్ ద్వారా ఫొటోలు షేర్ చేసుకుంటే కేసు దర్యాప్తు వేగవంతమవడంతో పాటు మిస్టరీలు వీడే అవకాశం   ఉంటుందన్నారు. బాధితులకు సకాలంలో న్యాయం చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రజల సహకారం ఉంటే శాంతి భద్రతలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించగలమన్నారు.

551 మందికి...

సైబరాబాద్‌లోని ఎస్‌ఐ స్థాయి నుంచి కమిషనర్ వరకు సుమారు 551 మందికి వాట్సప్ సౌకర్యం కల్పించామని సీవీ ఆనంద్ వివరించారు. వీరందరి వద్ద ఇంటర్‌నెట్ సౌకర్యం కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఉంటాయన్నారు. ఇదే నెంబర్‌తో వాట్సప్‌లో 10 గ్రూప్‌లను చేర్చామని తెలిపారు. లా అండ్ ఆర్డర్ గ్రూప్‌లో 69 మంది, క్రైమ్ గ్రూప్‌లో 99, ట్రాఫిక్ గ్రూప్‌లో 79, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో 50 మంది, మీడియా గ్రూప్‌లో 56 మంది, మాదాపూర్ జోన్ గ్రూప్‌లో 51 మంది, బాలనగర్ జోన్ గ్రూప్‌లో 36 మంది, ఎల్బీనగ ర్ జోన్ గ్రూప్‌లో 66 మంది, శంషాబాద్ జోన్ గ్రూప్‌లో 40, మల్కాజ్‌గిరి జోన్ గ్రూప్‌లో 36 మంది పోలీసులను చేర్చినట్టు చెప్పారు. ఈ గ్రూప్‌లన్నింటికి 94906 17444 అడ్మిన్ నెంబర్‌గా ఉంటుంది. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఏ సమస్యలనైనా వాట్సప్ ద్వారా తెలియజేయవచ్చని కమిషనర్ తెలిపారు.

ఫిర్యాదును సంబంధిత పోలీసు గ్రూప్‌లకు పంపించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నేరాలు, మహిళలకు వేధింపులు, ఈవ్‌టీజింగ్, ట్రాఫిక్, శాంతి భద్రతలకు సంబంధించిన ఫిర్యాదులు, సలహాలు, సూచనలను మెసేజ్‌ల ద్వారా ఆడియో, వీడియో, క్లిప్పింగ్‌ల రూపంలో ప్రజలు పంపించవచ్చు. పోలీసుల అక్రమాలు, మంచి పనులు కూడా వాట్సప్‌కు పంపించవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.వి.శశిధర్‌రెడ్డి, అదనపు డీసీపీ ప్రతాప్‌రెడ్డి, ఏసీపీ రవీందర్ రెడ్డి, జి.పి.వాసుసేన, అడ్మిన్ ఇన్‌స్పెక్టర్ ఆనంద్‌రెడ్డి, సుధీర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు