కేంద్ర సహకారం లేదు: డీఎస్

29 Jun, 2016 04:28 IST|Sakshi
కేంద్ర సహకారం లేదు: డీఎస్

రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేసిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత్‌రావు
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నా కేంద్రం నుంచి ఆశించిన సహకారం లభించడం లేదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఇక్కడ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

‘కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశాను. మేమందరం ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వెయ్యి రూపాయల పెన్షన్, సన్న బియ్యం.. ఇంకా ఎన్నెన్నో పథకాలు అమలవుతున్నాయి. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఒక కాలవ్యవధి పెట్టుకుని ముందుకు సాగుతున్నాం. అయితే కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడంలేదు.

కేంద్ర ప్రోత్సాహాన్ని సంపాదించేందుకు నావంతు కృషి చేస్తా’ అని పేర్కొన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా ‘కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అనేది పార్టీ నిర్ణయించే అంశం. ప్రజోపయోగ కార్యక్రమాల్లో మా మద్దతు తప్పకుండా ఉంటుంది..’ అని అన్నారు. డీఎస్‌తో పాటు వొడితెల లక్ష్మీకాంతరావు కూడా మంగళవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బంగారు తెలంగాణకు తన వంతు కృషిచేస్తానని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు