డీఏ పెంపు అమల్లోకి..

2 Sep, 2016 07:27 IST|Sakshi
డీఏ పెంపు అమల్లోకి..

 అక్టోబర్ ఒకటిన ఇచ్చే జీతంతో చెల్లింపులు

►జనవరి నుంచి ఇవ్వాల్సిన బకాయిలు జీపీఎఫ్‌లో జమ
►3.144 శాతం పెరిగి 18.340 శాతానికి చేరిన డీఏ
►4.5 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రయోజనం


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.144 శాతం కరువు భత్యం (డీఏ) పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జనవరి నుంచే ఇది వర్తించనుంది. దీంతో దాదాపు 4.50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనుండగా.. ఖజానాపై ఏటా రూ.300 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగులకు మూల వేతనంపై 15.196 శాతం డీఏ అమల్లో ఉంది. ప్రస్తుతం పెంచిన 3.144 శాతం కలిపి మొత్తంగా డీఏ 18.340 శాతానికి చేరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ గురువారం జీవో నం.103 జారీ చేశారు. సెప్టెంబర్ నెల వేతనం నుంచి అంటే అక్టోబర్ ఒకటిన చేతికందే జీతంతోపాటు పెరిగిన కరువు భత్యాన్ని నగదుగా చెల్లిస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థల్లో రెగ్యులర్ జీతంపై పనిచేస్తున్న వారికి, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ఎయిడెడ్ విద్యా సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, ఉద్యోగులకు పెరిగిన డీఏ వర్తిస్తుంది.

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇక కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌లో కొనసాగుతున్న ఉద్యోగులకు 90 శాతం బకాయిలను నగదుగా చెల్లిస్తారు. మిగతా పది శాతాన్ని ప్రాన్ (పీఆర్‌ఏఎన్) ఖాతాలో జమ చేస్తారు. ఈ ఏడాది డిసెంబర్ 31లోగా పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు వంద శాతం బకాయిలు నగదు రూపంలోనే చెల్లిస్తారు. జీపీఎఫ్ ఖాతా లేని ఉద్యోగులున్నట్లయితే.. వారి డీఏ బకాయిల మొత్తాన్ని ప్రభుత్వం కంపల్సరీ సేవింగ్ ఖాతాలో జమ చేస్తుంది. సదరు ఉద్యోగులు ఖాతాలు తెరిచిన తర్వాత జీపీఎఫ్‌లో సర్దుబాటు చేస్తారు. బకాయిలకు సంబంధించి అక్టోబర్ 15లోగా ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్ కార్యాలయాల్లో బిల్లులు సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇక పెన్షనర్లకు కరువు భృతి పెంపు ఉత్తర్వులను ఒకటి రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు