హరితహారంపై డేగకన్ను

12 Jul, 2016 02:43 IST|Sakshi
హరితహారంపై డేగకన్ను

- అధికారులు, ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రతిరోజు నిఘా నివేదికలు: సీఎం కేసీఆర్
- ఈ కార్యక్రమం నేతల పనితీరుకు నిదర్శనం
- ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పరీక్షా సమయం
 
 సాక్షి, హైదరాబాద్ : హరితహారం కార్యక్రమాన్ని ఆషామాషీ వ్యవహారంగా తీసుకోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. రెండువారాల పాటు కొనసాగే హరితహారం అధికారులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సహా గ్రామ సర్పం చుల పని తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పరీక్షా సమయమని, తేలిక భావనను వీడి మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. ‘‘వేగులతో రోజువారీగా హరితహారం పురోగతిని, పనితీరు నివేదికలను వివిధ రకాలుగా తెప్పిం చుకుంటున్నాం. ఎవరెట్లా పని చేస్తున్నారో పది జిల్లాల నుంచి ప్రతిరోజు నివేదికలు వస్తున్నాయి. అలసత్వం వహించిన ప్రజాప్రతిని ధులు, అధికారుల పేర్లు సరైన సమయంలో బయటికొస్తాయి’’ అని పేర్కొన్నారు. ‘‘కాలం కనికరించింది. వానలు పడుతున్నాయి. మొ క్కల  పెంపకానికి ఇది అనువైన సమయం. నిర్లక్ష్యంతో ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. ఎలాంటి అలసత్వాన్ని ప్రభుత్వం సహించదు’’ అని అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం హరితహారంపై సమీక్ష నిర్వహించారు. హరితహారాన్ని విజయవంతం చేసేందుకు సీఎస్‌కు పలు ఆదేశాలు జారీ చేశారు.

 ప్రతి గ్రామం.. ప్రతి విభాగం..
 ‘‘విభాగాల వారీగా ఉద్యోగులు వారి కార్యాలయాల పరిధిలో నిర్దేశించిన ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమంలో ఎలా పాల్గొంటున్నారు..? ఎన్ని మొక్కలు నాటారు? వాటి సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టారన్న వివరాలు ప్రతిరోజు అధికారులు సేకరించాలి. తమ నివేదికలను పైఅధికారులకు అందించాలి. సంబంధిత శాఖాధిపతుల ద్వారా ఏ రోజుకారోజు అన్ని శాఖల కార్యదర్శులు ఈ నివేదికలు తెప్పించుకోవాలి. వీటిని సీఎస్‌కు అందజేయాలి’’ అని సీఎం సూచించారు. ప్రతిరోజు సాయంత్రానికి ఈ నివేదికలు సీఎంవో కార్యాలయానికి చేరాలన్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు వారి సిబ్బంది హరితహారంలో పూర్తి స్థాయిలో పాల్గొనాలని, జిల్లావ్యాప్తంగా పర్యటించి కార్యక్రమాన్ని సమన్వయం చేసే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.

 రోజూ గ్రామాలకు వెళ్లాలి
 ‘‘తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండలంలో ఉన్న గ్రామాలను పంచుకోవాలి. హరితహారం కార్యక్రమాన్ని బాధ్యతగా స్వీకరించాలి. ప్రతిరోజు గ్రామాలకు వెళ్లాలి. మొక్కలు ఎలా నాటుతున్నారు, సంరక్షించేందుకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ప్రతి గ్రామ సర్పంచ్‌తో మాట్లాడాలి’’ అని సీఎం చెప్పారు.

 ప్రజాప్రతినిధులూ.. పారాహుషార్!
 రెండు వారాలపాటు గ్రామాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై, అంతటా కలియ తిరిగి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండలాల్లోని ప్రజాప్రతినిధులకు సీఎం సూచించారు. మొక్కలు పెంపకంపై దృష్టి సారించిన విధంగానే పెరిగిన చెట్లను నరికివేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. అక్రమంగా అడవుల నుంచి కలపను తరలించే స్మగ్లర్ల అటకట్టించేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. స్మగ్లింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నుంచి దూరం పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 విపక్షాల విమర్శలు హాస్యాస్పదం
 ప్రతిపక్ష నేతలు హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం హాస్యాస్పదమని సీఎం దుయ్యబట్టారు. ‘‘గతంలో ఏడాది పొడవునా కనీసం కోటి మొక్కలు నాటిన పాపాన పోలేదు. హరితహారం ప్రజా ఉద్యమంలా సాగుతుంటే ఓర్వలేకపోతున్నారు. హరితహారానికి ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంతో తెలుసుకోలేని నేతలు ఇందులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనం. భవిష్యత్ తరాల కోసం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విమర్శించడం మానుకోవాలి’’ అని హితవు పలికారు. వనాల పెంపకం, సంరక్షణపై గత ప్రభుత్వాల అలసత్వం కారణంగానే తెలంగాణలో పచ్చదనం పలుచబడిందన్నారు.  ఈ దుస్థితిని అధిగమించేందుకే హరితహారం కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు