‘డెయిరీ’ ముసుగులో క ల్తీ నెయ్యి తయారీ

28 Apr, 2016 02:02 IST|Sakshi
‘డెయిరీ’ ముసుగులో క ల్తీ నెయ్యి తయారీ

సితార అగ్‌మార్క్ పేరుతో విక్రయం
‘వెంకటేశ్వర డెయిరీ ఫామ్’పై
టాస్క్‌ఫోర్స్ దాడి
ఇద్దరి అరెస్ట్, 930 లీటర్లు స్వాధీనం

 
సాక్షి, సిటీబ్యూరో: డెయిరీ ఫామ్ ముసుగులో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న ఓ కేంద్రం గుట్టును ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు.  ఇద్దరిని అరెస్టు చేసి భారీగా కల్తీ నెయ్యి, తయారీకి ఉపకరించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట మహంకాళి తోట ప్రాంతానికి చెందిన గాజుల నటరాజ్ కార్ఖానాలో వెంకటేశ్వర డెయిరీ ఫామ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. డెయిరీ ఉత్పత్తుల తయారీ కోసం ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇతను కల్తీ నెయ్యి తయారీకి తెరలేపాడు. పామాయిల్, వనస్పతి, క్రీమ్‌లు కలిపి నెయ్యిని తయారు చేసి ‘సితార అగ్‌మార్క్’ పేరుతో విక్రయిస్తున్నాడు. తన డ్రైవర్ జోజిబాబు ద్వారా కల్తీ నెయ్యిని దుకాణాలకు సరఫరా చేయిస్తున్నాడు. 

వినియోగదారుల ఆరోగ్యానికి ముప్పుగా మారే ఈ దందాపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ కె.నరేష్ గౌడ్‌కు సమాచారం అందింది. దీంతో ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్ నేతృత్వంలో ఎస్సైలు ఎ.సుధాకర్, కె.శివ తమ బృందాలతో దాడి చేసి నటరాజ్, జోజిబాబుల్ని అరెస్టు చేశారు. 930 లీటర్ల కల్తీ నెయ్యి, 700 లీటర్ల క్రీమ్, 92 లీటర్ల పామాయిల్, 10 లీటర్ల వనస్పతి తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సైదాబాద్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు