డామిట్... కథ అడ్డం తిరిగింది!

23 Oct, 2016 04:06 IST|Sakshi
డామిట్... కథ అడ్డం తిరిగింది!

సినిమాల్లో నష్టంతో డ్రగ్స్ అమ్మే స్థాయికి దిగజారి...
కటకటాల పాలైన వర్ధమాన నిర్మాత, అసిస్టెంట్ డెరైక్టర్

 
సాక్షి, హైదరాబాద్: సినీ పరిశ్రమలో స్థిరపడదామని కలలు కన్న ఓ వ్యక్తి నష్టాలపాలై చివరకు మాదక ద్రవ్యాలు అమ్మే స్థాయికి దిగజారాడు. దానికి అప్పుల్లో మునిగిన మరో అసిస్టెంట్ డెరైక్టర్ సహకరించాడు. సీన్ కట్ చేస్తే... కల చెదిరి ఇద్దరూ ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నారు. వీరిని బాలానగర్ ఎస్‌ఓటీ, జీడిమెట్ల పోలీసులు శనివారం అరెస్టు చేశారు. రూ.3కోట్లు విలువ చేసే 1.3 కిలోల ఆంఫిటమైన్, కొకైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. బాలానగర్ ఏసీపీ నర్సింహారెడ్డి తదితరులు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
 సినిమా పిచ్చితో దారి తప్పి...

డిగ్రీ వరకు చదివిన నెల్లూరు జిల్లాకు చెందిన కె.వెంకటసురేశ్‌బాబు ఆ తర్వాత వజ్రాల వ్యాపారం చేసి బాగానే డబ్బులు సంపాదించాడు. సినిమాలపై మక్కువతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ తెలుగు సినిమా మొదలెట్టాడు. దానిపై రూ.60 లక్షల వరకు ఖర్చు చేసినా, ఇంకా బడ్జెట్ అవసరముండటంతో అది మధ్యలోనే ఆగిపోయింది. అప్పటికే రాంగోపాల్‌వర్మ వద్ద అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేసిన నిజామాబాద్ జిల్లాకు చెందిన కిశోర్‌తో పరిచయం ఏర్పడింది. కిశోర్... చాలా మంది వద్ద అప్పులు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సురేశ్‌కు... నెల్లూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఓ కేఫ్ యజమాని మారం శ్రీహరిరెడ్డితో పరిచయమైంది.

తన ఇబ్బందులను శ్రీహరిరెడ్డికి చెప్పాడు. డ్రగ్స్ అమ్మితే తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించవచ్చని శ్రీహరి సలహా ఇచ్చి... 1.3 కిలోల ఆంఫిటమైన్, కొకైన్‌ను సురేశ్‌కు అందించాడు. విషయాన్ని కిశోర్‌కు కూడా చెప్పాడు. ఇద్దరూ కలసి దుండిగల్‌లోని ఓ కాలేజీ విద్యార్థులకు డ్రగ్స్ ప్యాకెట్లు అమ్మేందుకు బైక్‌పై వెళ్లారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు కుత్బుల్లాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద తనిఖీలు చేస్తుండగా వీరిని పట్టుకున్నారు. నిందితులను రిమాండ్‌కి తరలించారు. సైబరాబాద్ సీపీ సందీప్‌శాండిల్యా ఇచ్చిన సమాచారం ఆధారంగా నెల్లూరు పోలీసులు మరో నిందితుడు శ్రీహరిరెడ్డిని నెల్లూరులో అరెస్టు చేశారు. అతడి నుంచి 1.5 కిలోల ఆంఫిటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
 

మరిన్ని వార్తలు