సీఎంకు అవార్డు ఇచ్చింది కేంద్ర సంస్థ కాదు: శ్రవణ్‌

21 Aug, 2017 01:27 IST|Sakshi
సీఎంకు అవార్డు ఇచ్చింది కేంద్ర సంస్థ కాదు: శ్రవణ్‌
సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవార్డు ప్రకటించిన ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ అనేది విత్తనాల బ్రోకర్‌ సంస్థ అని, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాదని టీపీసీసీ ముఖ్య అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. ఆదివారం ఆయన మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్‌తో కలసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ విత్తనాల బ్రోకర్‌గా వ్యవహరించే ఈ ప్రైవేటు సంస్థ అవార్డు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా గవర్నర్‌ కూడా అభినందించడం దారుణమని విమర్శించారు. తెలంగాణను సీడ్‌బౌల్‌ చేస్తామనే కేసీఆర్‌ ప్రకటనను ఆసరాగా చేసుకుని, రాష్ట్రాన్ని దోచేయడానికి జరుగుతున్న కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రికి ఈ ప్రైవేటు సంస్థ అవార్డును ఇచ్చిందన్నారు.

అది ప్రైవేటు సంస్థ అనే విషయం తెలుసుకోకుండా గవర్నర్‌ అభినందనలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీనిని వెంటనే ఉపసంహరించుకున్నట్టుగా ప్రకటించాలని శ్రవణ్‌ డిమాండ్‌ చేశారు. రైతులకు బేడీలేసినందుకు ఈ అవార్డు ఇచ్చారా అని ప్రశ్నించారు. నకిలీ విత్తనాలతో రైతును ముంచిన కంపెనీలకు అండగా ఉన్న కేసీఆర్‌ అవార్డుకు ఎలా అర్హుడవుతారని నిలదీశారు. భూసేకరణచట్టాన్ని అమలుచేయకుండా పోలీసులతో సీఎం దాడులు చేయించారన్నారు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వ్యవసాయ నిపుణుడు స్వామినాథన్‌ మాట్లాడటం సరికాదన్నారు.
మరిన్ని వార్తలు