స్వేచ్ఛా భారత్‌ దిశగా కదలండి

27 Jan, 2018 04:34 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న రచయిత్రి ప్రతిభానందకుమార్‌

భావవ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడుకోవాలి

కన్నడ సాహిత్యం గొప్ప సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించింది

హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో కన్నడ రచయిత్రి ప్రతిభానందకుమార్‌

భిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్‌: సీఎస్‌ ఎస్పీ సింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: స్వేచ్ఛా భారత్‌ దిశగా సాహితీవేత్తలు, కవులు, రచయితలు ముందడుగు వేయాలని ప్రముఖ కన్నడ రచయిత్రి, సీనియర్‌ జర్నలిస్టు ప్రతిభానందకుమార్‌ పిలుపునిచ్చారు. భిన్న ఆలోచనలను, విభిన్న సాహిత్యాలను సమాజం ప్రతిబింబించాలని, భిన్నాభిప్రాయాలను వ్యక్తీకరించే భావప్రకటనా స్వేచ్ఛను ఎప్పటికీ కోల్పోవద్దని ఆమె సూచించారు. శుక్రవారం బేగంపేట్‌ పబ్లిక్‌ స్కూల్‌లో హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ‘కన్నడ సాహిత్యం అప్పుడు–ఇప్పుడు’అనే అంశంపై ప్రతిభా నందకుమార్‌ కీలక ఉపన్యాసం చేశారు. సామాజిక పరిణామాలకు, మార్పులకు అనుగుణంగా కన్నడ సాహిత్యం ఎప్పటికప్పుడు స్పందిస్తూనే ఉందని, భావప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవడంలో కన్నడ సాహితీవేత్తలు మొదటి నుంచి ముందంజలో ఉన్నారని ఆమె చెప్పారు. ఇప్పుడు సమాజాన్ని ప్రతిబింబిస్తోన్న సోషల్‌ మీడియా కంటే బలమైన సాహిత్యాన్ని తాము దశాబ్దాల క్రితమే రాసినట్లు పేర్కొన్నారు.
కుచించుకుపోతున్న

ప్రజాస్వామిక వాతావరణం
పద్మావత్‌ వంటి సినిమాను వ్యతిరేకించడం, అందులోని కథాంశాన్ని జీర్ణించుకోలేకపోవడం ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి అసహనం తాము ఎప్పుడూ ఎదుర్కోలేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక వాతావరణం రోజురోజుకూ కుచించుకుపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, వివక్ష కొనసాగుతున్న రోజుల్లోనే తాము స్వేచ్ఛగా సాహితీ సృజన చేశామని, 35 ఏళ్ల క్రితమే తాను ఎరోటిక్‌ పొయెట్రీ రాసినట్లు ఆమె గుర్తుచేశారు.

కొంతమంది జ్యోతిష్య పండితులు మహిళల పట్ల చాలా చులకనగా మాట్లాడుతున్నారని, ఫలానా రాశి మహిళలు అత్యాచారాలకు గురయ్యే అవకాశం ఉందంటూ చేస్తోన్న ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, దీనిపై తాను ‘ఆగ్రహం’అనే కవిత రాసినట్లు గుర్తు చేశారు. సృజనాత్మక రచనలకు సోషల్‌మీడియా సరికొత్త వేదికగా మారుతోందని, స్వేచ్ఛాయుత వాతావరణం కోసం, వివక్ష, పురుషాధిపత్యం లేని సమాజం కోసం నేటితరం రచయితలు కృషి చేయాలని కోరారు.

భిన్న సంస్కృతులకు నిలయం..
లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ ఎస్పీ సింగ్‌ మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతులకు, కళలకు హైదరాబాద్‌ నిలయమని అన్నారు. మగ్ధూం మొహియుద్దీన్, సరోజినీనాయుడు, డాక్టర్‌ సి.నారాయణరెడ్డి వంటి ఎందరో మహానుభావులు హైదరాబాద్‌ నుంచి తమ కలాన్ని, గళాన్ని ప్రపంచానికి వినిపించారని చెప్పారు. హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ అంతర్జాతీయ సాహిత్యంతో పాటు, తెలంగాణ సాహిత్య సంస్కృతులకు వేదిక కావాలని ఆకాంక్షించారు. కొత్తతరం రచయితలు, కవులు, సాహితీవేత్తలు ఎదిగేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయన్నారు.

స్పెయిన్‌ రాయబార కార్యాలయం డిప్యూటీ హెడ్‌ ఆఫ్‌ మిషన్‌ ఎడ్యురో సాంచెజ్‌ మొరాకో మాట్లాడుతూ.. స్పానిష్‌ భాషకు తెలుగు భాషకు పోలికలున్నాయని, తెలుగులో ఉన్నట్లుగానే స్పానిష్‌లోనూ మాండలికాలు ఉన్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రెండు ప్రాంతాల మధ్య ఒక చక్కటి సాంస్కృతిక వాతావరణం నెలకొంటుందని చెప్పారు. ప్రఖ్యాత నర్తకి సోనాల్‌మాన్‌సింగ్‌ మాట్లాడుతూ.. ప్రపంచంలో మరెక్కడా లేని వైవిధ్యభరిత సంస్కృతి, అత్యున్నత సంప్రదాయాలు, విలువలు ఒక్క భారత్‌లోనే ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వం ఈ దేశం గొప్పదనమని చెప్పారు. పర్యాటక శాఖ   కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రారంభోత్సవ సభలో కన్నడంలో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు.

చర్చాగోష్టులు.. సాంస్కృతిక కార్యక్రమాలు
అనంతరం స్పెయిన్‌ మహిళా రచయిత్రుల సాహిత్యంపైనా, పలువురు రచయితలు రాసిన పుస్తకాలపైనా చర్చాగోష్టులు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన దళిత సామాజిక కార్యకర్త సరస్వతి వంట చేస్తూ చెప్పిన రామాయణం, దక్కనీ ఉర్దూలో సాగిన మిజాహియా ముషాయిరా తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 70 మంది కళాకారులు నిర్వహించిన కోలాటం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, సినీ దర్శకుడు డాక్టర్‌ కిన్నెరమూర్తి తదితరులు పాల్గొన్నారు.  

             లిటరరీ ఫెస్టివల్‌ ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ సింగ్‌. చిత్రంలో బుర్రా వెంకటేశం

మరిన్ని వార్తలు