దయానీ తల్లి పిటిషన్ కొట్టివేత

10 Sep, 2014 01:30 IST|Sakshi

హైదరాబాద్ : స్నేక్‌గ్యాంగ్‌లో సభ్యుడంటూ అరెస్ట్ చేసిన తన కుమారుడు ఫైజల్ దయానీని కోర్టు ఎదుట హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు దయానీని పహాడీషరీఫ్ పోలీసులు అక్రమంగా నిర్భందించారని, అతనిని కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తల్లి హుస్సేనీ గతవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, వివరణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాలని పహాడీఫరీఫ్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు మంగళవారం ధర్మాసనం ముందు హాజరై ఓ నివేదికను కోర్టు ముందుంచారు. స్నేక్‌గ్యాంగ్‌లో ఫైజల్ దయానీ కూడా నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు అతడికి జుడీషియల్ కస్టడీ విధించిందని అందులో వివరించారు. దీంతో సంతృప్తి చెందిన ధర్మాసనం, హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది

మరిన్ని వార్తలు