కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు

15 Oct, 2016 02:35 IST|Sakshi

ఈ నెలాఖరులోగానే నియామకాలు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో టీపీసీసీ భవిష్యత్తు కార్యాచరణపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని 10 జిల్లాలకు అదనంగా ఆవిర్భవించిన మరో 21 జిల్లాలకు సారథులను నియమించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న డీసీసీ అధ్యక్షులను కొనసాగించాలని నిర్ణయించింది. డీసీసీ అధ్యక్షులు లేకుండా ఖాళీగా ఉన్న జిల్లాలతోపాటు కొత్తగా 21 జిల్లాలకు అధ్యక్షులను నియమించడానికి పార్టీ ముఖ్యుల నుంచి, ఆశావహుల నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డిజిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు అధ్యక్షులను వీలైనంత తొందరలోనే నియమించాలని భావిస్తున్నారు.

పార్టీలో పని చేయగలిగే నేతల నుంచి దరఖాస్తులు స్వీకరించి, పార్టీ సీనియర్ల అభిప్రాయాలను తీసుకుని అధిష్టానం ఆమోదం పొందాలని టీపీసీసీ భావిస్తోంది. డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయిన వెంటనే జిల్లాల వారీగా సమస్యలు, పార్టీకి ఉపయోగపడే కార్యక్రమాలపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది. జిల్లాల పరిధి కూడా తగ్గిపోవడంతో పూర్తిస్థాయిలో పని చేయగలిగే నాయకులుంటే పార్టీని బలోపేతం చేయడం సులభమని టీపీసీసీ అంచనా వేస్తోంది. ఉత్సాహంగా పనిచేస్తూ, పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకోగలిగిన నాయకుల కోసం జిల్లాల వారీగా అన్వేషణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియను అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పుడున్న జిల్లాలకు పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారినే కొనసాగించనుంది. జిల్లా అధ్యక్షులు ఏ జిల్లా పరిధిలోకి వచ్చారో, ఆ జిల్లాకు పాత అధ్యక్షుడినే కొనసాగించాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు