బరాత్ డ్యాన్స్‌ల్లో మారణాయుధాలు వద్దు

7 May, 2016 20:28 IST|Sakshi

చార్మినార్: ఫంక్షన్ హాళ్ల వద్ద అర్దరాత్రి వరకు బరాత్‌ల పేరుతో మారణాయుధాలు తిప్పుతూ ప్రమాదకర డ్యాన్స్‌లు చేయటం ఘర్షణలకు దారి తీస్తున్నాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఈ డ్యాన్స్లపై నిబంధన విధించినట్లు చెప్పారు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శనివారం సాయంత్రం పురానీహవేలీలోని దక్షిణ మండలం డీసీపీ కార్యాలయ సమావేశ మందిరంలో పాతబస్తీలోని వివిధ ఫంక్షన్ హాల్స్ యజమానులు, నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్స్ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని... హాళ్లను అద్దెకు తీసుకుంటున్న వారిని వారించలేకపోతున్నారన్నారు. పెద్ద ఎత్తున ఆర్కెస్ట్రా వినియోగించడం, బ్యాండ్ బాజాలతో పాటు డీజేలను అనుమతించడం తదితర కార్యక్రమాలతో ఆయా ప్రాంతాల ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దక్షిణ మండలం అదనపు డీసీపీ బాబురావు మాట్లాడుతూ... ఇప్పటికే కొంతమంది ఫంక్షన్ హాల్స్ నిర్వాహకుల వ్యవహార శైలిపై తాము నిఘా పెట్టామని, సరైన ఆధారాల దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పదే పదే చెబుతున్నా వినకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు. చార్మినార్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, ఇన్స్‌పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు