పుస్తకం... ప్రియనేస్తం

20 Dec, 2014 23:59 IST|Sakshi
పుస్తకం... ప్రియనేస్తం

చదువరి చెంతకు పుస్తకరాజం
బహుభాషల భాగ్యనగరిలో
బుక్‌ఫెయిర్‌కు అపూర్వ ఆదరణ
పాఠకుడి వద్దకు పయనమైన ‘వట్టికోట’
మూడుపదులకు చేరువైన పుస్తక ప్రదర్శన
 

హైదరాబాద్ బుక్‌ఫెయిర్...మూడు దశాబ్దాలుగా చదువరి చెంతకే సాగుతున్న పుస్తక లోకమిది. విభిన్న సంస్కృతులు, బహుభాషలకు నిలయమైన భాగ్యనగరంలో ఏటేటా పుస్తకం వేడుక చేసుకుంటూనే ఉంది. లక్షలాదిగా తరలి వచ్చే పాఠక మహాశయుల జ్ఞానదాహార్తిని తీరుస్తూనే ఉంది. ఎనిమిదో దశాబ్దంలో మొదలై 28 ఏళ్లుగా అప్రతిహాతంగా కొనసాగుతున్న  పుస్తకప్రదర్శనకు  మొదటి నుంచి పాఠకులు బ్రహ్మరథం పడుతున్నారు. వైవిధ్యభరితమైన భాగ్యనగర సంస్కృతిని, విభిన్న జీవన శైలులను సమున్నతంగా ఆవిష్కరించే వివిధ భాషల పుస్తకాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో  ప్రతి రోజు వేలాది మంది పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకం కోసం తరలి రావడమే ఇందుకు నిదర్శనం. బాలల సాహిత్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం, వైద్యం, ఆరోగ్యం వంటి వివిధ రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలపై పాఠకులు మక్కువ చూపుతున్నారు. బుక్‌ఫెయిర్ సందర్భంగా నగరంలో పుస్తక ప్రదర్శన చారిత్రక నేపథ్యంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
 
సిటీబ్యూరో : హైదరాబాద్ నగరంలో 1980లలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైనప్పటికీ అంతకుముందే  పుస్తకాన్ని పాఠకుడి దగ్గరకు తీసుకొని వెళ్లే సంప్రదాయానికి రచయిత, ప్రచురణకర్త వట్టికోట ఆళ్వారుస్వామి శ్రీకారం చుట్టారు. పుస్తకాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి ప్రదర్శించాలనే ఆలోచనకు తావులేని రోజుల్లో ఆయన తాను ముద్రించిన పుస్తకాలను నెత్తిన పెట్టుకొని పాఠకుల ద గ్గరకు వెళ్లారు. ఇదంతా  1938 నాటి సంగతి. ఆ సంవత్సరం సికింద్రాబాద్‌లో  ‘దేశోద్ధారక గ్రంథమాలను’ ప్రారంభించిన వట్టికోట ఆ సంస్థ నుంచి 100 పుస్తకాలను ప్రచురించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1948 నాటికి సుమారు 50 పుస్తకాలను ముద్రించారు.  1948లో  అరెస్టై ఐదేళ్ల పాటు జైలు జీవితం గడిపారు. బయటకు వచ్చాక తాను చనిపోయే(1961) వరకు పలు పుస్తకాలను ముద్రించారు. నిజానికి  నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్ధూతో పాటు తెలుగు, మరాఠా, కన్నడం భాషలకు చెందిన ప్రజలతో పాటు హిందీ, ఇంగ్లీష్ పుస్తకాలు బాగా చదివే ప్రజలు కూడా మొదటి నుంచీ  ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠీలోని బడీచౌడీ ఒక పుస్తక బజార్‌గా వెలుగొందింది. ఈ బడిచౌడీ  బుక్ సెల్లర్సే  హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. విశాలాంధ్ర, ప్రజాశక్తి, మిళింద ప్రకాశన్, ఎమెస్కో, నవోదయ సంస్థలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతోధిక కృషి కొనసాగిస్తూనే ఉన్నాయి.

నేషనల్ బుక్ ట్రస్టు కృషి...

నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థల ఆకాంక్షలను నేషనల్ బుక్‌ట్రస్టు పరిపూర్తి చేసింది. నేషనల్ బుక్ ట్రస్టు ఇక్కడి సంస్థలతో కలిసి 986 ప్రాంతంలో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను కేశవ మొమోరియల్ స్కూల్ మైదానంలో మొదటిసారి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతూనే ఉన్నాయి. కథలు, నవలలు, గుల్ఫికలు, చరిత్ర  గ్రంథాలదే ఇక్కడ అగ్రస్థానం. చలం, బుచ్చిబాబు, కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్, వట్టికోట, విశ్వనాథ సత్యనారాయణ, షేక్‌స్పియర్, సోమర్‌సెట్ మామ్, యద్ధనపూడి, మాదిరెడ్డి, కొమ్మూరి వేణుగోపాల్‌రావు వంటి ప్రముఖుల గ్రంథాలను పాఠకులు  ఎక్కువగా ఇష్టపడ్డారు. సోవియెట్ సాహిత్యం కూడా బాగా ప్రభావితం చేసింది. క్రమంగా  ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. ‘మహాత్మాగాంధీ ఆత్మకథ’ వంటి  గ్రంథాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు లక్షలాది మంది పాఠకులను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.

 ప్రత్యేక కార్యక్రమాలు...
 
ఈ నెల 21న ఎమెస్కో పుస్తక ఆవిష్కరణ
22న  రాజకీయ పార్టీల నేతలతో చర్చా కార్యక్రమం
23న పత్రికా సంపాదకుల సమావేశం
24న పుస్తకావిష్కరణ, జయరాజ్ పాటల కార్యక్రమం
25న సైన్స్ డ్రామా
26న ముగింపు, స్పీకర్ మధుసూధనాచారి హాజరు.
 
పిల్లలను చదివించండి

ప్రపంచీకరణ తరువాత జీవన వేగం బాగా పెరిగింది. నవలలు,కథలు వంటి  పుస్తకాలకు కొద్దిగా ఆదరణ తగ్గినప్పుటికీ మిగతా వాటికి  బాగానే ఉంది. అయితే  ఇప్పటి పిల్లలు ఫేస్‌బుక్‌లు, స్మార్ట్‌ఫోన్‌లకు పరిమితమైపోవడమే బాధగా ఉంది. పిల్లల్ని చదివించాలి.తల్లిదండ్రులు బాధ్యతగా ఆ పని చేయాలి.సామాజిక చైతన్యాన్ని ఇచ్చేవి, జ్ఞానాన్ని కలిగించేవి, ఉన్నతమైన  విలువలను  బోధించే పుస్తకాలను తప్పనిసరిగా చదివించాలి.
 

- లలితా జోషి ( మొట్టమొదటి హైదరాబాద్
 బుక్‌ఫెయిర్ కమిటీ సభ్యురాలు)
 

మరిన్ని వార్తలు