డిగ్రీ కాలేజీల్లో పెరగనున్న 6 వేల సీట్లు

9 Feb, 2017 00:43 IST|Sakshi

ఇదివరకే దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లోనే పెంపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 6 వేల వరకు అదనపు సీట్లు రాబోతున్నాయి. 2017–18 విద్యా సంవత్సరంలో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకపోయినా, ఉన్న డిగ్రీ కాలేజీల్లో అదనంగా కోర్సులను ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది. అయితే అదనపు కోర్సుల ప్రారంభం కోసం తాజాగా ఇపుడు ఎలాంటి దరఖాస్తులను తీసుకోవడం లేదు. గతంలో దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో మాత్రమే కొత్తగా కోర్సులను ప్రారంభించేందుకు అనుమతులు ఇచ్చేలా ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లో పీజీ సెంటర్ల ఏర్పాటుకు గతంలో దరఖాస్తులు వచ్చినా, కొత్తగా పీజీ సెంటర్లను ఇవ్వడం లేదు. కొత్తగా ప్రైవేటు డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ఈసారి అనుమతి ఇవ్వవద్దని నిర్ణయించింది.

జెండర్‌ సెన్సిటైజేషన్‌పై ప్రత్యేక పుస్తకం
డిగ్రీ ప్రథమ సంవత్సరం రెండో సెమిస్టర్‌లో జెండర్‌ సెన్సిటైజేషన్‌ను ప్రత్యేక సబ్జెక్టుగా ప్రవేశ పెట్టేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది.  ఇప్పటికే సిలబస్‌ రూపొందించి, పాఠ్యాంశాల రచనను పూర్తి చేసింది. మరికొద్ది రోజుల్లో దానిని తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ముద్రించి అందుబాటులోకి తేనుంది.

మరిన్ని వార్తలు