ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలెలా?

6 May, 2016 02:11 IST|Sakshi
ఆన్‌లైన్ డిగ్రీ ప్రవేశాలెలా?

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ఆన్‌లైన్ ప్రవేశాల విధానం అమలుపై ఉన్నత విద్యా మండలి, కళాశాల విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఈ విధానంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారంపై సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా కొన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఆన్‌లైన్ ప్రవేశాలు చేపడితే ఫీజులను సమీక్షించి పెంచాలని...తమ కాలేజీల్లో తామే ప్రవేశాలు చేపడతామని పేర్కొంటున్నాయి. అటానమస్ కాలేజీలు సైతం సొంతంగా ప్రవేశాలు చేపడతామని చెబుతున్నాయి. దీంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.

ఇదే అంశంపై గురువారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం, కళాశాల విద్య కమిషనర్ వాణీప్రసాద్ ఇతర అధికారులు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు, అటానమస్ కాలేజీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భేటీలో చర్చకొచ్చిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాకే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
 మీరు కేటాయించే వారు మాకొద్దు...
 
విద్యార్థి సామర్థ్యాలు, ఆర్థిక స్తోమతనుబట్టి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) వంటి కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుందని కాలేజీల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. విద్యార్థులను ఎంపిక చేసే అవకాశాన్ని తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వం కాలేజీకి పంపితే నాణ్యత ప్రమాణాలు పడిపోతాయని, సామర్థ్యాలు లేని విద్యార్థులు కాలేజీల్లోకి వస్తే మెరుగైన ఫలితాలు రావని చెబుతున్నాయి. పైగా ఈ ప్రవేశాలను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో లింకు పెట్టవద్దని...ఫీజులు చెల్లించలేని వారు కౌన్సెలింగ్ ద్వారా వస్తే కాలేజీల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొంటున్నాయి.
 
ఇప్పటికిప్పుడు కష్టమే...
ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపట్టాలంటే రాష్ట్రంలోని 1,280 డిగ్రీ కాలేజీలు ఆఫర్ చేస్తున్న కోర్సులు వేలల్లో ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పటికిప్పుడు కాలేజీలవారీగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. అంతేకాకుండా వాటిల్లోని ఫీజులను వివరాలను పొందుపరచాల్సి ఉంది. ఇందు కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టంను (సీబీసీఎస్) కచ్చితంగా అమలు చేయాలి. దీనిపై ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనివర్సిటీలన్నీ వాటి పరిశీలనలో పడ్డాయి.

ముఖ్యంగా సీబీసీఎస్‌లో విద్యా బోధన, కోర్సులను అనుసంధానించడం పెద్ద ప్రక్రియ. కనీసం ఇప్పటికిప్పుడు యూనివర్సిటీ స్థాయిలోనైనా దానిని అమలు చేయాల్సి ఉంది. అంటే తమ యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఆఫర్ చేసే కోర్సులను తమ తమ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాల్సి ఉంది. అప్పుడే విద్యార్థి తనకు ఇష్టమైన కాలేజీలో 60 శాతం కోర్ సబ్జెక్టులను ఎంచుకోవడంతో తాను అదనంగా కోరుకునే సబ్జెక్టులను 40 శాతం కోర్, కోర్ ఎలక్టివ్‌లను ఇతర కాలేజీల్లో ఎంచుకునే వీలుంటుంది. అందుకే వర్సిటీలన్నీ ఆ పనిపై దృష్టి సారించాయి. ఈ పరిస్థితుల్లో ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టాలంటే కష్టమన్న భావన యూనివర్సిటీ వర్గాల్లోనూ నెలకొంది.

మరిన్ని వార్తలు