డిలీట్‌ చేస్తే నెలకు రూ.5 లక్షలు

3 May, 2017 06:58 IST|Sakshi
డిలీట్‌ చేస్తే నెలకు రూ.5 లక్షలు

- అక్రమ చలాన్లు సరిచేస్తే నెలకు రూ.2 లక్షలు
- మరీ దాసోహపడితే ఏడాదికో కొత్త కారు
- ఆరు నెలలకోసారి ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్రిప్‌
- ప్రతీ ఆర్థిక సంవత్సరం చివర రూ.5 లక్షల బోనస్‌
- కమర్షియల్‌ స్కాంలో అధికారులకు తాయిలాలు
- సీఐడీ విచారణలో వెలుగులోకి..


సాక్షి, హైదరాబాద్‌: బోధన్‌ స్కామ్‌కు సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ అధికారుల విచారణలో వరుసగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలో పోస్టింగ్‌లో ఉన్నంత కాలం డబ్బుకు లోటుండదు. అతిథి సత్కారాలకు అంతరాయం ఉండదు. టూర్లు, షికార్లు, విందులు, వినోదాలకు ఢోకాలేదు. అన్నీ తానై శివరాజు సెటప్‌ చేసి పెట్టాడు. ఏ అధికారి వచ్చినా అక్కడ శివరాజుదే పైచేయి. అతడు చెప్పిందే లెక్క. అతడు కట్టిందే ట్యాక్స్‌. మూడు చలాన్లు, ఆరు కమిషన్లతో హాయిగా సాగిపోయింది. దండుకున్నోళ్లకు.. దండుకున్నంత అన్నట్టుగా ఇన్నాళ్లూ నడిచిపోయింది. ఇలా ఒకటా రెండా.. ఏకంగా రూ.350 కోట్లు అప్పనంగా కొట్టేశారు. సీఐడీ చేస్తున్న దర్యాప్తులో ఒక్కో అధికారి దిగమింగిన లెక్క మెల్లమెల్లగా బయటకు వస్తోంది.

డిలీట్‌ చేస్తే నెలకు రూ.5 లక్షలు..
నకిలీ చలాన్లు సృష్టించి ట్యాక్స్‌ క్లయిమ్‌ చేసినందుకు ఏసీటీవో నుంచి డిప్యూటీ కమిషనర్‌ వరకు శివరాజు పక్కాగా లకారాలు అందించాడు. అక్కడ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన శ్రీనివాస్‌రావు విచారణలో సీఐడీ ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. నిజామాబాద్‌ జిల్లా కింద ఉన్న నాలుగు సర్కి ల్‌ కార్యాలయాల్లో ప్రతీ నెలా ట్యాక్స్‌ అమౌం ట్‌ను కమర్షియల్‌ ట్యాక్స్‌ వెబ్‌పోర్టల్‌లో ఎంట ర్‌ చేస్తారు. అయితే నకిలీ చలాన్ల ద్వారా వచ్చే అమౌంట్, సర్కిల్‌ కార్యాలయాల్లో ఆడిటింగ్‌లో వచ్చిన అమౌంట్‌ సరిపోలాలి. అయితే ప్ర తి నెలా ఈ రెండింటిని పోల్చేందుకు డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావు తన ప్రతిభ ఉపయోగించాడు. పోర్టల్‌లో పొందుపరిచిన వివరాల ను సరిచేయడం, తప్పుగా ఉంటే డిలీట్‌ చేయడం, శివరాజు చెప్పిన లెక్కను యథావిథిగా పోర్టల్‌లో ఎంట్రీ చేయడం శ్రీనివాస్‌రావు చేసేవాడని సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇందుకుగానూ శివరాజు గ్యాంగ్‌ నుంచి ప్రతి నెలా రూ.5 లక్షలు శ్రీనివాస్‌రావు పుచ్చుకున్నట్టు విచారణలో బయటపడిందన్నారు.

అక్రమాలకు తగ్గ రేటు.. ప్యాకేజీలు..
డిప్యూటీ కమిషనర్‌కు నెలకు రూ.5 లక్షలు పక్కాగా 3వ తేదీన శివరాజు అందించేవాడని, సీటీవోకు రూ.2 లక్షల నగదు తీసుకొచ్చి ఇచ్చేవాడని విచారణలో తేలింది. డివిజన్‌ అధికా రికి రూ.2 లక్షలు, ఏసీటీవోకు రూ.లక్ష పక్కాగా అందించాడని సీఐడీ బయటపెట్టింది. ఏటా శివరాజు బంపర్‌ ఆఫర్లు ఇచ్చేవాడు. డిప్యూటీ కమిషనర్‌ శ్రీనివాస్‌రావుకు హోండా అమేజ్‌ కారు.. రిటైర్డ్‌ సీటీవోకు షెవర్లెట్‌ స్పార్క్‌ కారును గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. ఆరు నెలలకోసారి ప్రతీ సర్కిల్‌ కార్యాలయం బృందానికి గోవా, ఊటీ, కేరళ, అండమాన్‌.. ఇలా టూర్లకు కూడా తిప్పాడని విచారణలో వెల్లడైంది.

ప్రతీ నెలా 30న కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులు కోరుకున్న చోట, కోరుకున్న విందు ఏర్పాటు చేశాడని, ప్రతీ ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో ఒక్కో అధికారికి రూ.5 లక్షలు బోనస్‌ కూడా ఇచ్చాడని సీఐడీ ఆధారాలతో బయటపెట్టింది. ఈ లెక్కన జాయింట్‌ కమిషనర్ల నుంచి ఏసీటీవోల వరకు హోదాను బట్టి ఒక్కో అధికారి ఆస్తులు కనీసం రూ.50 కోట్లకు పైమాటే అని సీఐడీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అరెస్టయిన అధికారులపై త్వరలోనే ఏసీబీ యాక్షన్‌ ప్లాన్‌ ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ప్రభుత్వ ఖజానాను దోచుకున్నందుకు పీసీ యాక్ట్‌ కింద కేసులు పెట్టే అవకాశం ఉందని తెలిసింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా