మానసిక కుంగుబాటు

6 Apr, 2017 02:00 IST|Sakshi
మానసిక కుంగుబాటు

నలుగురు మహిళల్లో ఒకరికి డిప్రెషన్‌
బాధితుల్లో 67 శాతం మంది ఆత్మహత్యకు యత్నం..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం
ఏప్రెల్‌ 7న  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..


సిటీబ్యూరో: మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వెరసి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా దేశంలోని ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు, పది మంది పురుషుల్లో ఒకరు డిప్రెషన్‌(మానసిక కుంగుబాటు)కు లోనవుతున్నారు. వీరిలో 67 శాతం మంది ఆత్మహత్యాత్నానికి పాల్పడుతుండగా, మరో 45 శాతం మంది మద్యం, ఇతర మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతున్నట్లు జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ(2015–16)లో వెల్లడైంది. అంతేకాదు ఇది ప్రత్యక్షంగా మనిషిని మానసికంగా కుంగదీయడమే కాకుండా పరోక్షంగా డయాబెటిక్, హైపర్‌ టెన్షన్, కేన్సర్‌లకు కారణమవుతున్నట్లు గుర్తించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్‌ 7)సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఏటా ఒక థీమ్‌ను తీసుకుని, ఆ అంశంపై అవగాహన కల్పిస్తున్న విష యం తెలిసిందే. అయితే ఈ ఏ డాది ‘డిప్రెషన్‌–లెట్స్‌ టాక్‌’ అంశాన్ని థీమ్‌గా ఎంచుకోవడం విశేషం.

కౌమార దశ నుంచే..
జనాభాలో 13 ఏళ్ల నుంచి 17 ఏళ్లలోపు బాధితుల్లో 7.3 శాతం మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. భార్యభర్తలు పిల్లలకు తగిన సమయం కేటాయించక పోవడం వల్ల వారు చిన్నతనంలోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు తేలింది. భయంతో చాలా మంది చికిత్సకు ముందుకు రావడం లేదు. ధైర్యంతో ముందుకు వచ్చిన వాళ్లకు కూడా నిపుణుల కొరత కారణంగా సరైన వైద్య సేవలు అందడం లేదు. యూరప్‌లో ప్రతి లక్ష మందికి 10 మంది మానసిక నిపుణులు ఉండగా, యూఎస్‌ఏలో 16 మంది ఉన్నారు. మన దేశంలో ఒక్కరే ఉండటం గమనార్హం.

ఇద్దరూ పని చేయడం వల్లే
భార్యభర్తల్లో చాలా మంది ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారు. వీరు ఎక్కువ సమయం ఆఫీసులోనే గడుపుతూ, పిల్లలకు కనీస సమయం కేటాయిం చడంలేదు. దీంతో వారు ఇంట్లో ఒంటరిగా ఉంటూ టీవీల్లో వచ్చే నేర ప్రేరేపిత ప్రసారాలను చూస్తూ వాటిని అనుసరిస్తున్నారు. చిన్న వయసులోనే మద్యం, మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నా రు. మానసిక కుంగుబాటు వల్ల చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
– ప్రేరణ కోహ్లీ,ప్రముఖ సైక్రియాటిస్ట్, న్యూఢిల్లీ

6–9 గంటలు నిద్రపోవాలి
ఒత్తిడిని జయించడం చాలా సులభం. ఏ విధమైన ఖర్చులేని, సహజ వ్యాయామమైన నడక. ప్రతి గంట నడక వ్యక్తి ఆయుఃప్రమాణాన్ని 3 నిముషాలు పెంచుతుంది. ఆరోగ్యకరమైన జీవితం గడపటానికి 6 నుంచి 9 గంటల నిద్ర  అవసరం. నిద్ర సమయంలో శరీరం విశ్రాంతి తీసుకోవటం తోపాటు  రోగనిరోధక  శక్తిని పెంచుకుంటుంది. బాధాకరమైన అనుభవాల నుంచి బయటపడేందుకు దోహద పడుతుంది.
– డాక్టర్‌ శివరాజు, కిమ్స్‌

మరిన్ని వార్తలు