తెలుగు రాష్ట్రాల్లో పుష్కరాలకు పోటెత్తిన భక్తులు

21 Aug, 2016 10:03 IST|Sakshi

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్నానం ఆచరించేందుకు భక్తులు తెల్లవారే పుష్కర ఘాట్లకు చేరుకున్నారు. విజయవాడలోని సంగమం, పద్మావతి, జగ్గయ్యపేట సమీపంలోని వేదాద్రి ఘాట్లలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే గుంటూరు జిల్లాలోని అమరావతి, సీతానగరం ఘాట్లలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కర్నూలు జిల్లాలో సంగమేశ్వరం, పాతాళగంగ, లింగాలగట్టు ఘాట్లకు భక్తులు భారీ గా తరలివచ్చారు.

ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిని శ్రీదుర్గామల్లేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కిలోమీటర్ల మేర బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో దేవాలయ ప్రాంతం జనసంద్రంగా మారింది. దీంతో భక్తులను అదుపు చేయలేక పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఉదయం 9.00 గంటల వరకు 75 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. తాగేందుకు మంచి నీరు దొరకక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.    
 
తెలంగాణలోని మట్టపల్లి, వాడపల్లి, నాగార్జునసాగర్ ఘాట్లలో భక్తుల రద్దీ భారీగా ఉంది. మహబూబ్నగర్ జిల్లాలోని బీచుపల్లి, గొందిమళ్ల, సోమశిల ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణా పుష్కరోత్సవం ఆదివారం 10వ రోజుకు చేరుకుంది. మరో రెండు రోజుల్లో ఈ పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలోని భక్తులు పుణ్యస్నానం ఆచరించేందుకు పయనమవుతున్నారు.

>
మరిన్ని వార్తలు