డయల్-100 సర్వీస్‌ను వాడుకోండి: డీజీపీ

22 Sep, 2016 19:50 IST|Sakshi

హైదరాబాద్: జంట నగరాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు పడుతున్న ఇబ్బందుల దష్ట్యా ట్రాఫిక్ పోలీసులతోపాటు శాంతిభద్రతలను పర్యవేక్షించే సివిల్ పోలీసులు కూడా భాగస్వాములు కావాలని రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ ఆదేశించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేష్ భగవత్ తదితర సీనియర్ అధికారులతో డీజీపీ గురువారం సమావేశమై వర్షాల పరిస్థితిపై చర్చించారు. వర్షాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు. ఎఫ్ ఎం రేడియో, టీవీ స్క్రోలింగ్, మైక్ ఎనౌన్స్‌మెంట్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి ప్రచార మాధ్యమాలను ఉపయోగించుకొని ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాలని ఆదేశించారు.

వర్షం కారణంగా నీళ్లు ఇళ్లలోకి, సెల్లార్లలోకి వచ్చినా డయల్ - 100 సర్వీస్‌ను ఉపయోగించుకోవాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్, మెట్రో రైలు అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. నాలాలు పొంగడం, రోడ్లపై మ్యాన్‌ హోల్స్ కనిపించకపోవడం వంటి కారణాలతో వృద్ధులు, బాలలు, మహిళలు ప్రమాదాల బారినపడే అవకాశం ఉన్నందున గల్లీల్లోని రోడ్ల పట్ల పోలీస్ సిబ్బంది శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యాలయ వేళలు, పాఠశాలలు, కళాశాలల సమయాల్లో ఎదురయ్యే ట్రాఫిక్ జామ్ను వెంటవెంటనే క్లియర్ చేసే విధంగా ప్రతి పోలీస్ అధికారి రెండు మూడు రోజుల పాటు పనిచేయాలని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు