చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం

31 Dec, 2015 03:05 IST|Sakshi
చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించేది లేదని డీజీపీ అనురాగ్‌శర్మ స్పష్టం చేశారు. మావోయిస్టులైనా, ఉగ్రవాదులైనా చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. బుధవారం డీజీపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక విలేకరుల సమావేశంలో అనురాగ్‌శర్మ మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఈ సంవత్సరం 92,685 కేసులు నమోదు చేశామని చెప్పారు.

గతంతో పోల్చితే నేరాలు స్వల్పంగా తగ్గడంతో పాటు పోలీసుల పనితీరు చాలా మెరుగుపడిందన్నారు.సొత్తు కోసం హత్యలు, కిడ్నాప్‌లు, ఘర్షణలు, సైబర్ నేరాలు కాస్త తగ్గాయన్నారు. చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన కేసులు పెరిగాయన్నారు. గతేడాది 678 సైబర్ నేర కేసులు నమోదవగా.. ఈ ఏడాది 634కు తగ్గాయన్నారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద గతేడాది 1171 కేసులు నమోదవగా ఈ ఏడాది 1288కు పెరిగాయన్నారు. అలాగే వివిధ రకాల నేరాలపై అనురాగ్‌శర్మ వెల్లడించిన విషయాలను ఆయన మాటల్లోనే...

 మహిళలపై పెరిగిన నేరాలు..
 ఈ ఏడాది మహిళలపై నేరాలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది 1020 అత్యాచార కేసులు నమోదయ్యాయి. సీఐడీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని చంద్రపూర్, కర్నూలు, హైదరాబాద్‌లో దాడులు నిర్వహించి మొత్తం 808 మంది మహిళలను వ్యభిచార కూపాల నుంచి రక్షించాం. వీరిలో 308 మంది బాలికలున్నట్లు గుర్తించి వారిని రెస్క్యూ హోమ్‌లకు తరలించాం. మహిళల అక్రమ రవాణాకు సంబంధించి మొత్తం 554కేసులు నమోదవగా 381 మంది ట్రాఫికర్స్‌ను అరెస్టు చేశాం. మహిలపై వేధింపులను అరికట్టడంలో ‘షీ’టీమ్స్ సమర్థవంతంగా పనిచేశాయి. మొత్తం 660 కేసులలో 825 మంది పోకిరీల(ఈవ్‌టీజర్లు)ను అరెస్టు చేశాం. అలాగే ఆపరేషన్ స్మైల్ ద్వారా 2,552 తప్పిపోయిన చిన్నారులను గుర్తించామని, ఆపరేషన్ ముస్కాన్ ద్వారా 2,729 మంది గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 1108 మందిని తల్లిదండ్రుల చెంతకు చేరవేశామని, మిగతా వారు రెస్క్యూహోంలలో ఉంచాం.

 రోడ్డు భద్రతకు అధిక ప్రాధాన్యం...
 రోడ్డు ప్రమాదాల బారినపడి ఏటా పెరుగుతున్న మరణాల దృష్ట్యా జాతీయ, రాష్ట్ర రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాం. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18,534 కేసులు నమోదవగా, 6,495 మంది మృత్యువాతపడ్డారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లఘించిన వారి నుంచి ఈఏడాది రూ.35.53 కోట్లు వసూలు చేశాం. ప్రస్తుతం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ఉన్న ఈ చలాన్ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నాం.

 మావోయిస్టుల ప్రాబల్యం తగ్గింది...
 రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలను సమర్థవంతంగా నిలువరించగలిగాం. ఈ ఏడాది 11 మందిని అరెస్టు చేయగా, 12 మంది లొంగిపోయారు. ఎదురు కాల్పుల్లో ఆరుగురు మరణించగా... వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నిఘా వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయడం వల్ల మావోయిస్టులతో పాటు ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించగలిగాం. ముగ్గురు యువకులు ఐఎస్‌ఐఎస్‌లో చేరడానికి ఇంట్లో నుంచి పారిపోయిన 24 గంటల్లోనే గుర్తించగలిగాం.

 సంస్కరణలకు ప్రాధాన్యం...   
 పోలీసుశాఖలో సంస్కరణలో భాగంగా స్టేషన్ల ఆధునీకరణకు పెద్ద పీట వేస్తున్నాం. హైదరాబాద్, సైబరాబాద్ మాదిరిగా అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు మొదటి విడుతలో రూ.26 కోట్లు మంజూరు చేశాం. అలాగే... జిల్లాలోని ఎస్పీలతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్ కోసం ఏర్పాట్లను పూర్తిచేశాం. పోలీసు శాఖలో త్వరలో పది వేలకు పైగా రిక్రూట్‌మెంటులు నిర్వహించబోతున్నాం. 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు