నయీం ఖాకీలకు చార్జిమెమోలు!

21 Jun, 2017 02:06 IST|Sakshi

14 మందికి జారీ చేసిన డీజీపీ కార్యాలయం

సాక్షి, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి డీజీపీ కార్యాలయం చార్జిమెమోలు జారీ చేసినట్టు తెలిసింది. నయీంతో అంటకాగినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను సస్పెండ్‌ చేసిన డీజీపీ అనురాగ్‌ శర్మ.. మైనర్‌ పనిష్‌మెంట్ల కింద 14 మందికి చార్జిమెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నయీంతో కలిసి ఎందుకున్నారు, అతడికి మీకు సంబంధం ఏంటి, సిట్‌ దగ్గరున్న ఆధారాలపై మీ వివరణ ఏంటి.. అనే  అంశాలను చేరుస్తూ వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు సమాచారం. ఈ మెమోలపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. సంబంధిత అధికారిగానీ, సిబ్బందిగానీ ఇచ్చే వివరణ సరిగ్గా లేకుంటే తదుపరి చర్యలకు వెళ్లే అవకాశం ఉంటుందని సీనియర్‌ అధికారులు అభిప్రాయపడ్డారు.

లైట్‌ తీసుకో..: మరోవైపు నయీం కేసులో ఇక పోలీస్‌ శాఖ గానీ, ప్రభుత్వం గానీ ముందుకు వెళ్లే వీలు లేదని చార్జిమెమోలు అందుకున్న అధికారులు బహిరంగంగానే చెబుతున్నారు. సస్పెన్షన్‌పైనే తీవ్రమైన ఒత్తిడి ఉందని, చార్జిమెమోలు సూత్రప్రాయంగా ఇచ్చినవేనని, అంతకు మించి ఇందులో తదుపరి చర్యలకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ డీఎస్పీ స్పష్టంగా చెబుతున్నారు.

మరిన్ని వార్తలు