మధుమేహ నియంత్రణ ఇన్సులిన్‌తోనే సాధ్యం

1 Sep, 2013 02:32 IST|Sakshi

మాదాపూర్, న్యూస్‌లైన్ : మధుమేహ బాధితుల్లో ప్రాథమిక దశలో గ్లూకోజ్ నియంత్రణకు ఇన్సులిన్ ఒక్కటే మార్గమని అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ ఎ.మురుగనాథన్ అన్నారు. శనివారం మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ఏడవ జాతీయ ఇన్సులిన్ సదస్సును ఆయన ప్రారంభించారు. ఇండియన్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్, అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియా అకాడమిక్ వింగ్ సంయుక్తంగా రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాయి.

ఇందులో డాక్టర్ మురుగనాథన్ మాట్లాడుతూ... భారతదేశంలో మధుమేహ చికిత్స తీరుతెన్నులను మార్చేలా ఈ సదస్సు సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందన్నారు. నొవొ నార్‌డిస్క్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మెల్విన్ డి సౌజా మాట్లాడుతూ.. మధుమేహ బాధితులకు మెరుగైన చికిత్స, డాక్టర్లకు నూతన మార్గదర్శకాలపై అవగాహన కల్పించేందుకు సదస్సు దోహదం చేస్తుందన్నారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ అశోక్ కుమార్‌దాస్ మాట్లాడుతూ..

దేశంలో 63 మిలియన్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని తెలిపారు.ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బాధితులున్న రెండో దేశంగా భారత్ నిలిచిందన్నారు. రెండు రోజుల సదస్సుకు ‘కాన్సెప్ట్ ఇన్ మేనేజింగ్ డయాబెటీస్ కరెంట్ అండ్ ఎమర్జింగ్ అండ్ నావెల్’ అనే థీమ్ ఎంచుకొని పలు మధుమేహ సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. కార్యక్రమంలో క్లినికల్ పరిశోధకులు, కన్సల్టెంట్స్, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 500 మంది వైద్యులు పాల్గొన్నారు.
 
 ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం
 మధుమేహ వ్యాధికి ఆహారపు అల వాట్లే ప్రధాన కారణం. మధుమేహం వచ్చిందంటే నియంత్రణే మార్గం. ఇలాంటి సదస్సు మూలంగా అత్యాధునిక చికిత్సా విధానాలు తెలుసుకునేందుకు వీలుంటుంది.    
 - డాక్టర్ సిద్ధార్థ షా
 
 వ్యాయామం అవసరం
 మధుమేహ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోం ది. అందుకే ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి. ఈ సదస్సు మధుమేహ నియంత్రణకు  ఎంతో ఉపయోగపడుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్యులు వారి అనుభవాలను పంచుకోవడం వల్ల కొత్త చికిత్సా పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది.
 - ఎకె. దాస్
 
 దురలవాట్లు చేటు
 దురలవాట్లకు బానిసలైతే రోగాలను కొనితెచ్చుకున్నట్లే. మద్యం, ధూమపానం తదితర వ్యసనాల వల్ల మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉప్పు తక్కువ మోతాదులో వాడాలి. అందరూ వాకింగ్ చేయాలి.     
 - డాక్టర్ శౌకత్ ఎం సాదికోట్
 

మరిన్ని వార్తలు