టీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విభేదాలు

6 Jan, 2016 00:15 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో రచ్చకెక్కిన విభేదాలు

హోంమంత్రి ఎదుటే నేతల ఘర్షణ
 
అంబర్‌పేట: టీఆర్‌ఎస్‌లో విభేదాలు రచ్చకెక్కాయి. సాక్ష్యాత్తు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముందే అంబర్‌పేట నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. నువ్వేంత అంటే నువ్వేంత అని దుషించుకోవడంతో విస్తు పోవడం హోంమంత్రి వంతైంది. మంగళవారం గోల్నాక డివిజన్‌లోని ఖాద్రిబాగ్, తులసీనగర్ కాలనీల్లో సీసీ టీవీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యాక్రమానికి హోంమంత్రి నాయిని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఖాద్రీబాగ్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అంబర్‌పేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ కాలేరు  వెంకటేష్‌కు   మధ్య కొబ్బరికాయ కొట్టే విషయంలో వివాదం తలెత్తింది. వారు పరస్పర దూషణలకు దిగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీంతో వారి అనుచరులు నేతలకు మద్దతుగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో హోంమంత్రి జోక్యం చేసుకుని ఇరువురు నేతలను సముదాయించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అనంతరం హోంమంత్రి అక్కడి నుంచి తులసీనగర్ బయలుదేరి వెళ్లారు.
 

మరిన్ని వార్తలు