ఆర్టీసీకి ‘లోఫ్లోర్’ కష్టాలు!

2 Sep, 2016 01:45 IST|Sakshi
ఆర్టీసీకి ‘లోఫ్లోర్’ కష్టాలు!

జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్రం అంటగట్టిన లోఫ్లోర్ బస్సులు
- ఆరేళ్లకే నడవలేక మొరాయించిన వైనం
- మరమ్మతులతో రూ.కోట్లలో వ్యయం
- భరించలేక పాత బాడీ తీసేసి కొత్తగా బాడీ ఏర్పాటు
- ప్రతి బస్సుకు రూ.10 లక్షల చొప్పున రూ.100 కోట్ల ఖర్చు
- కేంద్రం సాయం కంటే ఈ వ్యయమే ఎక్కువ
 
 సాక్షి, హైదరాబాద్: ‘చారానా కోడికి బారానా మసాలా..’.. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం బస్సుల విషయంలో ఆర్టీసీ అధికారులు ఇదే సామెతను గుర్తుచేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా అంటగట్టిన లోఫ్లోర్ బస్సులతో తిప్పలు పడలేక ఆర్టీసీ సతమతం అవుతోంది. కొత్త బస్సులు కొనేందుకు అవకాశం లేక.. ఆ బస్సులనే మన పరిస్థితులకు అనుగుణంగా మార్చేందుకు భారీగా ఖర్చు చేస్తోంది. లోఫ్లోర్ బస్సుల కోసం కేంద్రం తన వంతు వాటాగా చేసిన ఆర్థిక సాయం కంటే.. ఇప్పుడు వాటిని బాగుచేసుకునేందుకు ఆర్టీసీ చేస్తున్న ఖర్చే ఎక్కువగా ఉండడం గమనార్హం. మొత్తంగా ఆ బస్సులతో  ఇంతకాలం వచ్చిన నష్టాలతో ఖజనాకు కన్నం పడితే, బాగు చేసుకుంటేగాని నడవని స్థితిలో ఉన్న వాటికి ఇప్పుడు పెడుతున్న ఖర్చు ఆర్టీసీకి తడిసి మోపడవుతోంది.

 మోయలేని భారం..
 విదేశీ నగరాల్లో నేల నుంచి తక్కువ ఎత్తులో ఫ్లోర్ (బస్సులో మన పాదాల కింద ఉండే భాగం) ఉండే బస్సులు ఆకట్టుకుంటాయి. వాటినే లోఫ్లోర్ బస్సులుగా చెబుతారు. అదే మన బస్సులు ఎత్తుగా ఉండి.. మూడు నాలుగు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అది వృద్ధులకు, పెద్ద వయసువారికి ఇబ్బంది కలిగించే అంశం. దీంతో విదేశీ తరహాలో లోఫ్లోర్ బస్సులను తేవాలని భావించిన అప్పటి యూపీఏ-2 ప్రభుత్వం... జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద దేశవ్యాప్తంగా వాటిని మంజూరు చేసింది. సాధారణంగా జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద కేంద్రం తన వాటా నిధులు విడుదల చేస్తే... మిగతా నిధులను ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కలుపుకొని బస్సులు కొనుగోలు చేస్తాయి. కానీ 2010లో కేంద్ర ప్రభుత్వమే బస్సులను బాడీతోసహా రూపొందించి సరఫరా చేసే బాధ్యతను పలు కంపెనీలకు అప్పగించింది. అలా హైదరాబాద్‌కు వెయ్యి బస్సులు మంజూరు చేసింది.

అందులో టాటా కంపెనీ మార్కోపోలోతో ఒప్పందం కుదుర్చుకుని సరఫరా చేసిన బస్సుల బాడీ దారుణంగాఉండటంతో పాటు ఆ నమూనా మన రోడ్లకు సరిపడలేదు. దాంతో కొద్దిరోజుల్లోనే ఆ బస్సులు బాగా దెబ్బతిన్నాయి. నిత్యం మరమ్మతులు చేస్తూ ఉంటేనే తప్ప కదలలేని స్థితికి చేరడంతో.. ఆర్టీసీకి భారీగా చేతి చమురు వదలడం మొదలైంది. అంతేగాకుండా ఆ బస్సుల బాడీ ఉక్కు (మైల్డ్ స్టీల్)తో రూపొందడంతో బరువు ఎక్కువగా ఉండి మైలేజీ తగ్గి ఖర్చు మరింత పెరిగింది. సాధారణంగా ఒక బస్సు 12 లక్షల కిలోమీటర్లు తిరిగినా.. 15 సంవత్సరాల పాటు కొనసాగినా, వాటిని తుక్కు కింద పరిగణించవచ్చు. కానీ ఈ బస్సులు ఆరేళ్లకే తుక్కుగా మారాయి. నిబంధనల ప్రకారం తుక్కు కింద తొలగించే అవకాశం లేదు, వాటి స్థానంలో కొత్త బస్సులు సమకూర్చుకునే స్థోమత ఆర్టీసీకి లేదు. దీంతో వాటి బాడీని తొలగించి హైదరాబాద్ రోడ్లకు తగిన నాణ్యతతో, సాధారణ డిజైన్ బాడీని అమర్చడం మొదలుపెట్టారు.
 
 ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చు
 జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కింద ఇచ్చిన ఆ బస్సుల బాడీని తీసేసి.. అల్యూమినియంతో సాధారణ డిజైన్‌లో రూపొందించే పని మొదలుపెట్టారు. మియాపూర్‌లోని ఆర్టీసీ బస్ బాడీ యూనిట్‌కు ఈ బాధ్యత అప్పగించారు. అక్కడ నెలకు 25 బస్సులకు మించి బాడీ రూపొందించే సామర్థ్యం లేదు. దీంతో ఈ సంవత్సరం 300 బస్సులకు కొత్త బాడీలు రూపొందించే పని మొదలుపెట్టి.. 175 బస్సులకు అమర్చారు. ఇందుకోసం ఒక్కో బస్సుకు రూ.10 లక్షలు ఖర్చవుతోంది. దీంతో కేంద్రం ఇచ్చిన వాటా సంగతేమోగానీ.. ఆర్టీసీ ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే బస్ బాడీ మార్చాక బరువు తగ్గి వాటి మైలేజీ బాగా మెరుగుపడిందని, ఆక్యుపెన్సీ రేషియో కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక భవిష్యత్తులో కేంద్రం నుంచి వాటా నిధులే తప్ప బస్సులు తీసుకోవద్దని ఆర్టీసీ గట్టిగా నిర్ణయించుకుంది.

మరిన్ని వార్తలు