దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్ల డిజిటైజేషన్‌

21 Feb, 2017 00:32 IST|Sakshi
దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్ల డిజిటైజేషన్‌

కాచిగూడలో డిజి–పే సర్వీసులను ప్రారంభించిన ద.మ. రైల్వే జీఎం

సాక్షి, హైదరాబాద్‌/హైదరాబాద్‌: డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా దేశంలోనే వంద శాతంవస్తు, సేవలను అందజేసే మొదటి ‘డిజి–పే స్టేషన్‌’గా కాచిగూడ రైల్వేస్టేషన్‌ అవతరించింది. టికెట్‌ బుకింగ్‌లతో పాటు, పార్సిళ్లు, రిటైరింగ్‌ రూమ్స్, పార్కింగ్‌ తదితర రైల్వే సదుపాయాలు, స్టాళ్లలో లభించే వస్తువులను డిజిటల్‌ చెల్లింపుల ద్వారా కొనుగోలు చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ సోమవారం డిజిటల్‌ సేవలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. దశలవారీగా దక్షిణమధ్య రైల్వేలోని అన్ని రైల్వేస్టేషన్లను డిజి–పే స్టేషన్‌లుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మొట్టమొదట 10 ఏ క్లాస్, ఏ–1 స్టేషన్‌లలో రెండో దశ డిజి సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. దశల వారీగా మిగతా స్టేషన్‌లలోనూ నగదురహిత సేవలు ప్రారంభించనున్నామన్నారు. డిజి–పే విధానం వల్ల ప్రతి వస్తువు కొనుగోలుకు బిల్లు వస్తుందని, దీంతో అక్రమాలకు పాల్పడే అవకాశమే లేదన్నారు.

స్వయంగా కొనుగోలు చేసిన జీఎం   
జీఎం వినోద్‌కుమార్‌ స్వయంగా ఒక స్టాల్‌లో డెబిట్‌ కార్డు ద్వారా వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేశారు. డిజి–పే పట్ల అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. డిజిటల్‌ సర్వీసులను అందిస్తున్న స్టాల్‌ నిర్వాహకులకు డిజి–పే జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే అదనపు జనరల్‌మేనేజర్‌ ఏకే గుప్తా, హైదరాబాద్‌ డీఆర్‌ఎం అరుణాసింగ్, ఆంధ్రాబ్యాంకు సీజీఎం సత్యనారాయణ మూర్తి, సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ బి.డి.క్రిష్టఫర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు