దిగ్విజయ్‌ వ్యాఖ్యలు అర్థరహితం

3 May, 2017 02:00 IST|Sakshi
దిగ్విజయ్‌ వ్యాఖ్యలు అర్థరహితం

ఆయనపై చర్యలు తప్పవ్‌: రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌
సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నాయకుడు దిగ్విజయ్‌ సింగ్‌ తెలంగాణ పోలీసులపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని టీఆర్‌ఎస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ మండిపడ్డారు. ముస్లిం యువకులను ఐసిస్‌లో చేరేలా తెలంగాణ పోలీసులు ప్రోత్సహిస్తున్నారని అనడం అర్థరహితమని, అవి తెలివితక్కువ మాటలని ఆయన అభిప్రాయ పడ్డారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పోలీసులకు మంచి పేరు ఉందని, వారి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయొద్దని హితవు పలికారు.

కేవలం దిగ్విజయ్‌ వల్లే మధ్యప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ దుకాణం బంద్‌ అయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులపై తప్పుడు ప్రచారం చేసిన ఆయన తక్షణం క్షమాపణ చెప్పాలని డీఎస్‌ డిమాండ్‌ చేశారు. ఆయన చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక వేళ ఏమైనా ఆధారాలు ఉంటే  బయటపెట్టాలని సూచించారు. ఆరోపణలు చేయగానే సరిపోదని, రుజువు చేయకుంటే చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. దిగ్విజయ్‌ లేపిన ఈ దుమారంపై కాంగ్రెస్‌ హై కమాండ్‌ స్పందించాలని అన్నారు.

మరిన్ని వార్తలు