‘దిల్‌సుఖ్‌నగర్’ ఉగ్రవాదులకు ఢిల్లీలో ‘విముక్తి’

1 Mar, 2016 00:53 IST|Sakshi
‘దిల్‌సుఖ్‌నగర్’ ఉగ్రవాదులకు ఢిల్లీలో ‘విముక్తి’

తెహసీన్, వఖాస్‌లపై అక్కడి కుట్ర కేసు నమోదు
ఆధారాలు లేవంటూ డిశ్చార్జ్ చేసిన న్యాయస్థానం
మిగిలిన నిందితుల్లో సయ్యద్ మగ్బూల్ సైతం
మానవబాంబు దాడులకు కుట్రపై 2012లో కేసు

 
సిటీబ్యూరో:  హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాలతో సహా దేశ వ్యాప్తంగా మానవ బాంబులతో దాడులకు కుట్ర పన్నిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లకు ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించింది. వీరిద్దరూ 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. ఢిల్లీ కుట్ర కేసులో హైదరాబాద్‌లో పట్టుబడిన సయ్యద్ మక్బూల్ సైతం ఉండటం గమనార్హం. ఐఎం కో-ఫౌండర్స్ రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ 2012లోనూ సిటీలో మారణహోమం సృష్టించడానికి కుట్రపన్నారని, ఏకంగా మానవ బాంబులతో మూడు జనసమ్మర్ధ ప్రాంతాల్లో విరుచుకుపడాలని పథకం వేశారని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గుర్తించారు. పాతబస్తీలోని షాహిన్‌నగర్‌లో నివసించిన సయ్యద్ మక్బూల్ ఈ కుట్రలో ప్రధాన భాగస్వామిగా ఉన్నాడని తేల్చారు. దీపావళి టపాసులుల్లో ఉండే మందు, డీజిల్, యూరియాలతో అత్యాధునికమైన ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ)లు తయారు చేయడానికి పథకం సిద్ధం చేసుకున్నట్లు తేల్చారు. 2012 అక్టోబర్ 26న నమోదు చేసిన కేసులో వీరి టార్గెట్‌లో హైదరాబాద్‌తో పాటు బీహార్‌లోని బుద్ధగయ ప్రాంతం కూడా ఉన్నాయని స్పెషల్ సెల్ పేర్కొంది.

మక్బూల్ మరో ఉగ్రవాదైన ఇమ్రాన్ ఖాన్‌తో కలిసి 2012లో హైదరాబాద్ వచ్చి, ద్విచక్ర వాహనంపై జనసమర్థ ప్రాంతాలైన దిల్‌సుఖ్‌నగర్, బేగంబజార్, అబిడ్స్ ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసులో మక్బూల్, ఇమ్రాన్ సహా మరికొందరు అప్పుడే అరెస్టు కాగా... మిగిలిన  వారిలో పరారీలో ఉన్న నిందితులైన తెహసీన్ అక్తర్, వఖాస్‌లు 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్ నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడ్డారు.  ఈ పేలుళ్లకు అవసరమైన బాంబుల తయారు చేసిన, 107 బస్టాప్‌లో విధ్వంసానికి కారణమైన వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 22న పట్టుకున్నారు. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లకు అవసరమైన సైకిళ్లను మలక్‌పేట్, జుమ్మేరాత్ బజార్‌ల్లో కొనుగోలు చేసిన... ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద పేలిన సైకిల్ బాంబును అక్కడ పెట్టిన తెహసీన్ సైతం అదే నెల 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పోలీసులకు చిక్కాడు. దీంతో ఢిల్లీలో నమోదైన మానవ బాంబుల కుట్ర.. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు సహా అనేక కేసుల్లో వీరిని అరెస్టు చేశారు. ప్రస్తుతం చర్లపల్లి కేంద్ర కారాగారంలో యాసీన్ భత్కల్‌తో పాటు తెహసీన్, వఖాస్... తీహర్ జైల్లో ఉన్న మక్బూల్, ఇమ్రాన్ తదితరులపై ఢిల్లీ స్పెషల్ సెల్ గత వారంలో  అభియోగాలు మోపుతూ అక్కడి కోర్టులో మెమో దాఖలు చేసింది. అయితే తెహసీన్, వఖాస్‌లపై సరైన ఆధారాలు లేవంటూ న్యాయస్థానం శుక్రవారం వీరిద్దరినీ డిశ్చార్జ్ చేసింది. మిగిలిన వారిపై ఈ నెల 28 నుంచి విచారణ చేపట్టనుంది.
 

మరిన్ని వార్తలు