అత్యవసర వైద్యం...దైన్యం

22 Oct, 2013 05:33 IST|Sakshi
అత్యవసర వైద్యం...దైన్యం

 

=గాంధీ, ఉస్మానియాల్లో ఇదీ తీరు..
 =ప్రాణాలు పోయని ధర్మాసుపత్రులు
 =జాడలేని అత్యవసర వైద్య విభాగాలు
 =దగాపడుతున్న రోగులు
 =వైద్యం అందక గాల్లో కలుస్తున్న ప్రాణాలు

 
 కొన ఊపిరితో కొట్టుమిట్టాడే వారు ఆ ఆస్పత్రి మెట్లెక్కగలిగితే చాలు.. ప్రాణాలు దక్కినట్టేనని భావిస్తారు..
 ఆ గాలి సోకితే పోతుందనుకున్న ప్రాణం నిలుస్తుందని నమ్ముతారు..

 అనుకోని విపత్తులు, ఊహించని ప్రమాదాల బారినపడి క్షతగాత్రులైన వారు మొదట చూసేది వాటివైపే...
 ఆసియా ఖండంలోనే అతిపెద్ద ధర్మాసుపత్రులవి. రోగుల సేవలో దశాబ్దాల ఖ్యాతిని మూటగట్టుకున్నా ఏం లాభం? ఘనతంతా గతం.. వైద్యమందని దైన్యమే నిజం.

 ఆశలు ఆవిరవుతున్నాయి. నమ్మకం వమ్మవుతోంది. గుప్పెడు ప్రాణాన్ని కాపాడుకునేందుకు వస్తున్న రోగుల్ని ఈ దవాఖానాలు దగా చేస్తున్నాయి.

 అత్యవసర విభాగం..
 కొన ప్రాణంతో వచ్చే వారికి ఆయుష్షు పోయాల్సిన విభాగమిది. అటు గాంధీ.. ఇటు ఉస్మానియా.. రెండుచోట్లా నయం కాని రీతిలో ఈ విభాగాలు నీరసించిపోయాయి.

 ‘గోల్డెన్ అవర్’గా పిలిచే చివరి క్షణాలు ఈ ఆసుపత్రుల ఆవరణలోనే అంతిమ గడియలుగా మారిపోతున్నాయి.
 ఇప్పుడక్కడ పేద రోగుల గుండెచప్పుడు వినేవారు లేరు. ఆదుకోవాల్సిన వైద్య నారాయణులే చేతులెత్తేస్తున్నారు.

 సాక్షి, సిటీబ్యూరో: కరీంనగర్ జిల్లా పోతర్లపల్లికి చెందిన బోడం సతీష్ (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. రక్తమోడుతున్న అతనిని రెండ్రోజుల క్రితం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. గంటల తరబడి వైద్యులెవరూ పట్టించుకోలేదు. చేసేది లేక మరో ఆస్పత్రికి వెళ్లిపోయాడు.
 
నగరంలోని వారాసిగూడకు చెందిన చింటూ (22) ఎంఎంటీఎస్ రైలు నుంచి జారి కిందపడితే.. 108లో ఉస్మానియాకు తరలించారు. అత్యవసర విభాగంలో చేరిన అతనిని అరగంటైనా పట్టించుకున్న వైద్యుడే లేడు.
 
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రమ్య ఇంట్లో వంట చేస్తూ కాలిన గాయాలకు గురైంది. తీవ్ర విషమస్థితిలో చేరిన ఆమెకు దాదాపు రెండు గంటల వరకు కనీసం ప్రథమ చికిత్స కూడా అందించలేకపోయారు.
 
పేదల దవాఖానాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో దగాపడటమే కాక.. తమనే నమ్ముకుని వస్తున్న రోగుల్ని ఉస్సూరనిపిస్తున్నాయి. ప్రాణాలు పోయాల్సిన ఈ ప్రాంగణాలు వైద్యానికి నోచుకోని రోగుల హాహాకారాలతో హోరెత్తుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు పొరుగునే ఉన్న న ల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్, మెదక్ జిల్లాల నుంచి వివిధ ప్రమాదాలు, విపత్తుల్లో గాయపడిన క్షతగాత్రులందరికీ ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులే పెద్దదిక్కు.

ఇటువంటి కేసుల్లో అత్యవసర విభాగాలందించే సేవలే కీలకం. కానీ దురదృష్టవశాత్తూ ఁగోల్డెన్ అవర్‌రూ.గా పిలిచే సమయమంతా పడిగాపులతోనే హరించుకుపోతోంది. పేదల పెద్దదిక్కుగా చెప్పుకునే ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి రోజూ 250-300 మంది రోగులు వస్తుంటారు. సకాలంలో వైద్యం అందక నెలకు ఇద్దరు నుంచి ముగ్గురు మృత్యువాత పడుతున్నట్లు స్వయంగా ఆస్పత్రి వర్గాలే చెబుతున్నాయి. గాంధీ ఆస్పత్రిలోనూ అదే పరిస్థితి నెలకొంది. అనుకోని ప్రమాదాల్లో పదుల కొద్దీ క్షతగాత్రులు గాయాలపాలై ఇక్కడకు వస్తే.. ఆస్పత్రి సిబ్బంది కిందామీదా పడే దుస్థితి నెలకొంటోంది.
 
 నిబంధనలేం చెబుతున్నాయంటే..
 అన్ని విభాగాల నిపుణులతో కూడిన అత్యవసర వైద్య విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి
     
 జనరల్ ఫిజీషియన్, సర్జన్, ఆర్థోపెడిక్, కిడ్నీ, హృద్రోగ నిపుణుడు, అనెస్థీషియా నిపుణులతో పాటు సహాయకులుగా పీజీలు 24 గంటలూ దశల వారీగా విధుల్లో ఉండేలా చూడాలి
     
 ఆస్పత్రిలో విధిగా ట్రామా సెంటర్ ఉండాలి
     
 రోగుల నిష్పత్తికి తగినన్ని హైడ్రాలిక్ బెడ్స్‌తో పాటు పారామెడికల్ స్టాఫ్, వార్డ్‌బోయ్‌లను నియమించాలి
     
 రోగుల తరలింపునకు సరిపడే స్ట్రెచర్లు, ట్రాలీలను నిరంతరం అందుబాటులో ఉంచాలి
     
 వెంటిలేటర్లు, మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు వంటివి తప్పనిసరి
     
 హృద్రోగుల కోసం ఈసీజీ యంత్రం, క్షతగాత్రుల కోసం ప్రత్యేక ఎక్స్‌రే యంత్రాన్ని ఏర్పాటు చేయాలి
     
 సత్వర వైద్య పరీక్షల కోసం ప్రత్యేక ల్యాబ్‌తో పాటు రక్తనిధి కేంద్రం అవసరం
 
 ఇదీ ‘అత్యవసర వైద్యం’ తీరు నయం కాని రోగం
 ఉస్మానియా ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో చేరుతున్న బాధితులకు ప్రాథమిక పరీక్షలు చేసి వెంటనే ఆయా విభాగాలకు తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది
     
 సమయానికి సూపర్ స్పెషాలిటీ నిపుణులు అందుబాటులో ఉండట్లేదు. వార్డు బోయ్‌లు, స్ట్రెచర్లు, ఇతర సౌకర్యాలు లే క.. బంధువులే రోగుల్ని భుజాన ఎత్తుకుని తీసుకెళ్తున్నారు
     
 శ్వాస సరిగా తీసుకోలేని వారికి వెంటనే వెంటిలేటర్ అమర్చాలి. కానీ అత్యవసర విభాగంలో ఒక్క వెంటిలేటరూ కన్పించడం లేదు
     
 హైడ్రాలిక్ బెడ్స్ ఏర్పాటు చేయాల్సిన చోట చిరిగిపోయిన పరుపులు, తుప్పుపట్టిన రేకు మంచాలే దిక్కవుతున్నాయి
     
 మొబైల్ ఆక్సిజన్ సిలిండర్లు, హృద్రోగులకు అమర్చే ఈసీజీ లీడ్స్, ఎక్సరే యంత్రాలు మచ్చుకైనా లేవు
     
 చూసేందుకే సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్.. పనితీరు మాత్రం పడకేస్తోంది
     
 బాంబు పేలుళ్లు, భారీ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు పెద్దసంఖ్యలో వచ్చే క్షతగాత్రులకు వైద్యం అందించేందుకు అవసరమైన అత్యవసరమైన వైద్య విభాగం ఇప్పటికీ లేదు.
 
 హే రామ్..

 సికింద్రాబాద్‌లోని గాంధీ జనరల్ ఆస్పత్రిలో నిత్యం 1565 మందికిపైగా రోగులు చికిత్స పొందుతుంటారు. అత్యవసర విభాగానికి రోజూ 200 మందికిపైగా రోగులు వస్తుంటారు
     
 ఇక్కడ కేవలం 24 పడకలు, ఒక వెంటిలేటర్, ఒక్కోటి చొప్పున ఈసీజీ, ఎక్స్‌రే యంత్రం ఉన్నాయి. వార్డులో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ సిష్టమ్ ఉన్నా పని చేయట్లేదు
     
 క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు ఏడాది క్రితం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ ల్యాబ్ మూలనపడింది. చిన్నచిన్న పరీక్షలకు సైతం బయటికి వెళ్లాల్సిందే
     
 అత్యవసర విభాగంలో హౌస్‌సర్జన్ల సేవలే కీలకం. వీరు 250 మంది ఉండగా, నిత్యం 50 మందికిపైగా విధులకు హాజరుకావడం లేదు. నిత్యం 7-8 మంది హౌస్ సర్జన్లు పని చేయాల్సిన చోట ఇద్దరు, ముగ్గురే కన్పిస్తున్నారు
     
 ఎమర్జెన్సీకి వచ్చిన క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్సలు చేసి అక్కడి నుంచి ఏఎంసీకి తరలించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది
     
 అన్ని విభాగాల్లోని నిపుణులతో ఇటీవల ఎమర్జెన్సీ మెడికల్ విభాగాన్ని ఏర్పాటు చేసినా, నేటికీ అమలుకు నోచుకోలేదు.
 
 ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం..
 ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిపుణులకు కొరత లేదు. కానీ, కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే సుశిక్షిత పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాల కొరత ఉంది. పేదల దవాఖానాల్లో రోగులకు వైద్యం అందకపోవడానికి ప్రభుత్వ వైఖరే కారణం. మందులు, ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన బడ్జెట్ కేటాయించట్లేదు. మెడికల్ ల్యాబ్‌లు, సాంకేతిక సిబ్బంది, ఇతర యంత్ర పరికరాలు సమకూర్చడం లేదు. అత్యవసర విభాగాల్లో వైద్యులు అందుబాటులో లేకపోవడానికి అధికారుల ఉదాసీన వైఖరే కారణం.
 
 - డాక్టర్ నాగేందర్, తెలంగాణ వైద్యుల సంఘం,
 ఉస్మానియా శాఖ అధ్యక్షుడు

 

మరిన్ని వార్తలు