ఎన్నాళ్లో ‘వెయిటింగ్’!

16 Dec, 2014 00:01 IST|Sakshi
ఎన్నాళ్లో ‘వెయిటింగ్’!

ముంచుకొస్తున్న సెలవులు
చలనం లేని రైల్వే శాఖ
జాడలేని ప్రత్యేక రైళ్లు
{పయాణికుల్లో ఆందోళన
ఉన్న రైళ్లలో భారీ స్థాయిలో వెయిటింగ్ లిస్ట్

 
సిటీబ్యూరో: ఓ వైపు పండుగ సెలవులు దగ్గర పడుతున్నాయి. పిల్లాపాపలతో కలసి ఊరె ళ్లి... కుటుంబాలతో సరదాగా గడపాలని భావించే జనం ఆశలపై రైల్వే శాఖ నీళ్లు చల్లుతోంది. డిమాండ్‌కు తగిన స్థాయిలో రైళ్లు లేకపోవడం...ఉన్న వాటిలో చాంతాడంత వెయిటింగ్ లిస్ట్‌లతో జనం దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఏటా అదే పరిస్థితి. సకాలంలో రైళ్లు దొరక్క... కిక్కిరిసిన రైళ్లలో ప్రయాణించలేక జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. కొద్ది రోజుల్లో క్రిస్మస్. ఆ తరువాత నూతన సంవత్సర ం... ఆ వెనుకే సంక్రాంతి పర్వదినం. ఈ నేపథ్యంలో సొంత ఊళ్లకు... తిరుపతి, షిర్డి వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు నగర వాసులు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. కానీ తగినన్ని రైళ్లు లేకపోవడం నిరాశకు గురి చేస్తోంది. హైదరాబాద్ నుంచి రాష్ర్టంలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విశాఖ, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు చాంతాడంత వెయిటింగ్ లిస్టుతో దర్శనమిస్తున్నాయి. చాలా రైళ్లలో ‘నో రూమ్’ బోర్డు వేలాడుతోంది. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తే తప్ప సొంత ఊరు వెళ్లలేని పరిస్థితి. రైల్వే అధికారులు ఇప్పటి వరకు సంక్రాంతి ప్రత్యేక రైళ్లను ప్రకటించ లేదు. దీనిపై ప్రయాణికుల్లో ఆందోళన  వ్యక్తమవుతోంది.  

 ఏటా తగ్గుతున్న ప్రత్యేక రైళ్లు

ప్రతి సంవత్సరం ప్రయాణికుల రద్దీ పెరుగుతుండగా... అధికారులు మాత్రం రైళ్ల సంఖ్యను కుదించేస్తున్నారు. సాధారణ రోజుల్లో   జంట నగరాల నుంచి సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే 1.8 లక్షల మంది ప్రయాణిస్తారు. సంక్రాంతి, దసరా పండుగ రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. సెలవు రోజుల్లో లక్ష నుంచి 2 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తారు. రద్దీ ఇలా పెరుగుతుండగా... ఏ ఏటికాయేడు ప్రత్యేక రైళ్లు  మాత్రం తగ్గిపోతున్నాయి. 2010లో సంక్రాంతికి 52 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. 2011లో వాటిని 40కి తగ్గించారు. 2012లో కేవలం 31 ప్రత్యేక రైళ్లు నడిపారు. గతేడాదీ అదే పరిస్థితి. సంక్రాంతి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కాస్త ఇప్పటికైనా ప్రత్యేక రైళ్లను ప్రకటి ంచడంతో పాటు..సంఖ్యనూ పెంచాలని నగర వాసులు కోరుతున్నారు. పండుగ సమీపించాక ప్రత్యేక రైళ్లు ప్రకటించడం వల్ల  పెద్దగా ప్రయోజనం ఉండదు. మరోవైపు ఎక్కువ శాతం సీట్లు దళారులే ఎగురేసుకు పోయే అవకాశం ఉంది. కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన శబరి ప్రత్యేక రైళ్లలో దళారులదే పైచేయిగా మారింది. శబరిమలై వెళ్లేందుకు 138 ప్రత్యేక రైళ్లను ప్రకటించినప్పటికీ  క్షణాల్లో బుకింగ్ ముగిసింది. ప్రస్తుతం రైళ్లు లేకపోవడంతో అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంక్రాంతి రైళ్లకు ఆ పరిస్థితి ఎదురవకుండా చూడాల్సిన అవసరం ఉంది.

వెయిటింగ్.. వెయిటింగ్

విశాఖ, తిరుపతి, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాల్లో బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లలో ఇప్పటికే ‘నోరూమ్’ బోర్డు దర్శనమిస్తోంది. కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్టు వందల సంఖ్యలో ఉంటోంది. గౌతమి, నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా, షిరిడీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్, నారాయణాద్రి, పద్మావతి, సెవెన్‌హిల్స్, బెంగళూర్ ఎక్స్‌ప్రెస్‌లలో వెయిటింగ్ లిస్టు వందల్లోకి చేరుకుంది. కొత్త సంవత్సరాది... క్రిస్మస్..సంక్రాంతి పండుగలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు