కుల వృత్తులకు నేరుగా రుణం

22 Jan, 2018 02:29 IST|Sakshi

బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

80 శాతం సబ్సిడీపై స్వయం ఉపాధి రుణాలు

బ్యాంకులతో సంబంధం లేకుండా లబ్ధిదారులకు

సబ్‌ప్లాన్‌ లేనట్లే.. ఎంబీసీ జాబితాలో 96 కులాలు!

బడ్జెట్‌కు ముందే భారీ కసరత్తు

సాక్షి, హైదరాబాద్‌ :  సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీసీల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం నుంచే నేరుగా లబ్ధి చేకూర్చాలని యోచిస్తోంది. 80 శాతం సబ్సిడీపై ఇచ్చే స్వయం ఉపాధి రుణాలకు తగినన్ని నిధులు కేటాయించాలని భావిస్తోంది.

వచ్చే బడ్జెట్‌లో ఈ రెండు అంశాలకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా కసరత్తు చేస్తోంది. గతేడాది బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసినప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయింది. బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు (ఎంబీసీలు) రూ.వెయ్యి కోట్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులకు రూ.250 కోట్ల చొప్పున కేటాయించింది. కానీ బీసీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికల పేరుతో జాప్యం జరగడంతో ఆ నిధులు ఖర్చు కాలేదు.  

ఎంబీసీ కులాలపై కొరవడిన స్పష్టత
మరోవైపు ఎంబీసీ కులాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఏయే కులాలను ఎంబీసీల జాబితాలో చేర్చనున్నారో వెల్లడించాలని ప్రభుత్వం యోచిస్తోంది. బీసీల్లో మొత్తం 113 కులాలు ఉండగా, వీటిలో 96 కులాలను ఎంబీసీలుగా పరిగణించాలని సీఎం సమక్షంలో జరిగిన చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఈసారి బడ్జెట్‌లో ఎంబీసీల జాబితా, వారి సంక్షేమానికి అమలు చేసే కార్యక్రమాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేప పిల్లల పంపిణీ, నేతన్నలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేసి చూపింది. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో నాయీ బ్రాహ్మణులు, రజకులకు కులవృత్తికి వీలుగా రాయితీతో ఆధునిక పనిముట్లు అందించాలని ఇప్పటికే నిర్ణయించింది. సంబంధిత కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన కూడా ఏర్పాటు చేసింది. విశ్వకర్మలు, శాలివాహనులు, సంచార జాతులకు కూడా ప్రత్యేక పథకాలు అమలు చేయాలని భావిస్తోంది.

ప్రధానంగా స్వయం ఉపాధి కల్పన కార్యక్రమాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రాయితీతో కూడిన రుణాలను ఇవ్వాలని యోచిస్తోంది. రూ.లక్ష లోపు రుణాలను 80 శాతం రాయితీతో అందించేందుకు ప్రాధాన్యమివ్వనుంది. వీలైతే బడ్జెట్‌కు ముందుగానే ఈ పథకాలను పట్టాలెక్కించాలని సీఎం భావిస్తున్నారు. సంచార జాతు లు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, విశ్వకర్మలు.. ఇలా ఆయా వర్గాల ప్రతినిధులతో విడివిడిగా ప్రగతి భవన్‌ వేదికగా కేసీఆర్‌ సమావేశమవుతారు. ఆయా వర్గాల కార్యక్రమాలను ప్రకటించడంతోపాటు లబ్ధిదారులకు రుణాల చెక్కులను కూడా అక్కడే మంజూరు చేయాలని భావిస్తున్నారు.  


సీఎం వద్ద నివేదికలు
బీసీల సంక్షేమంపై ఎమ్మెల్సీ గంగాధర్‌ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ ఒక నివేదికను సిద్ధం చేయగా, బీసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేతృత్వంలో చర్చలు జరగ్గా, అదే వరుసలో బీసీ ప్రజాప్రతినిధులు తమ సిఫారసులతో నివేదికను సిద్ధం చేశారు.

ఈ నివేదికలన్నీ ఇటీవల సీఎం కేసీఆర్‌కు చేరాయి. ఈ నేపథ్యంలో బీసీ సబ్‌ప్లాన్‌ అమలు చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమైనప్పటికీ బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులే లేనందున ఉప ప్రణాళికకు అవకాశం ఉండబోదని ప్రభుత్వ వర్గాలు తేల్చేశాయి. ఎస్సీ, ఎస్టీలకు మాదిరే ప్రత్యేక అభివృద్ధి నిధిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ.. బడ్జెట్‌లో బీసీలకు భారీ వాటా కేటాయించే దిశగానే ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  

మరిన్ని వార్తలు