హెచ్‌సీయూలో అంబేడ్కర్ విగ్రహం మాయం

6 Jul, 2016 00:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి వివాదానికి కేంద్రమైంది. దళిత విద్యార్థి రోహిత్ సహా ఐదుగురు విద్యార్థుల వెలివేత అనంతరం వర్సిటీలో వెలిసిన వెలివాడలోని అంబేడ్కర్ విగ్రహం సోమవారం అర్ధరాత్రి అపహరణకు గురైంది.  ఇది వీసీ అప్పారావు పనేనని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది.  ఇది భారత రాజ్యాంగానికి అవమానమని పేర్కొంది. పోలీసులు కూడా వీసీ చెప్పుచేతుల్లో ఉంటూ దళిత విద్యార్థులపై జరుగుతున్న దాడులను పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆరోపించారు. వెలివాడను పూర్తిగా తొలగించడానికి చేసిన కుట్రలో భాగంగా విగ్రహాన్ని మాయం చేశారన్నారు.

ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేంద్ర మంత్రి దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, వీసీ అప్పారావు తదితరులను అరెస్టు చేయకుండా పోలీసులు పక్షపాతవైఖరి అవలంభిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వీసీ తదితరులు తమపైనున్న నేరారోపణలు కప్పిపుచ్చుకునేందుకు వెలివాడను తొలగించేందుకు విఫలయత్నం చేస్తున్నారని సామాజిక న్యాయపోరాట విద్యార్థి జేఏసీ నాయకుడు ప్రశాంత్ అన్నారు.  వర్సిటీలో మంగళవారం నిర్వహించిన నిరసనలో విద్యార్థి నాయకులతోపాటు ఎస్సీ, ఎస్టీ అధ్యాపక సంఘం సభ్యులు కేవై రత్నం, శ్రీపతిరాయుడు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం ఏమైందో చెప్పాలని వీసీని డిమాండ్ చేశారు. అనంతరం వర్సిటీలోని షాప్‌కామ్ వద్ద నుంచి ఊరేగింపుగా వెళ్లిన విద్యార్థులు హెచ్‌సీయూ ప్రధాన గేటు ముందున్న రహదారిపై బైఠాయించారు. రాస్తారోకోతో  వాహనాలు స్తంభించిపోయాయి.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా