ఢిల్లీ పర్యటనపైనే చర్చ

22 Jul, 2016 03:23 IST|Sakshi

- గవర్నర్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ
- 24న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న గవర్నర్

 
 సాక్షి, హైదరాబాద్: హైకోర్టు విభజనతోపాటు కేంద్రంతో చర్చించిన వివిధ అంశాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు వివరించారు. 4 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని బుధవారం రాత్రి రాష్ట్రానికి తిరిగి వచ్చిన కేసీఆర్ గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. దాదాపు 2 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో సీఎం ఢిల్లీ పర్యటన విశేషాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీలో ప్రస్తావించిన అంశాలను సీఎం ఈ సందర్భంగా గవర్నర్‌కు వివరించారు. మరోవైపు పాలమూరు, డిండి ప్రాజెక్టులపై సుప్రీంకోర్టు చేసిన సూచనలతో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా పూర్తవుతుందని, ఏపీ ప్రభుత్వం చేస్తున్న వాదనలు వీగిపోయాయని సీఎం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. కరువుపీడిత పాలమూరు జిల్లాలో నాలుగు ఎత్తిపోతల పథకాల ప్రారంభోత్సవంతో ఖరీఫ్ నుంచే దాదాపు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు.
 
 మరోవైపు ఈ నెల 24న గవర్నర్ 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 25కు నాలుగేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో నరసింహన్ పాల్గొననున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రిని కలువనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రస్తావించిన అంశాలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కారమయ్యేందుకు చొరవ చూపాలని సీఎం గవర్నర్‌ను కోరినట్లు సమాచారం.

>
మరిన్ని వార్తలు