భూపంపిణీలో అడ్డంకులను దూరం చేయాలి

26 Jun, 2016 00:59 IST|Sakshi

ఎస్సీ శాఖకు  వివిధ సంఘాల నేతల సూచన

 

హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకంలో భాగంగా భూమిని కొనుగోలు చేసే రేటుపై కిందిస్థాయిలో సరిగా ప్రచారం జరగలేదని, కళాజాతాలు తదితర కార్యక్రమాల ద్వారా ప్రచారం చేయాలని ఎస్సీ శాఖకు అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు సూచించారు. ల్యాండ్ అసైన్‌మెంట్ కమిటీ మాదిరిగానే మండలస్థాయి కమిటీని ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని, ఎస్సీ కార్పొరేషన్ సిబ్బందిని పెంచాలని, బకాయిలను విడుదల చేయాలని, అధిక భూమి రియల్‌ఎస్టేట్ వ్యాపారుల వద్దనున్నందున భూమి రేటును మరింత పెంచాలనే సూచనలు వచ్చాయి. పంపిణీ చేసిన భూమిని లబ్ధిదారులు కౌలుకు ఇవ్వకుండా చూడాలని, ఎస్సీ కార్పొరేషన్‌లోనే భూమి కొనుగోలుకు ప్రత్యేకవిభాగం ఏర్పాటు చేయాలని సూచించారు.


శనివారం సంక్షేమ భవన్‌లో భూపంపిణీలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ‘స్టేక్‌హోల్టర్స్’తో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డా.పిడమర్తి రవి, ఎస్సీ శాఖ డెరైక్టర్ ఎం.వి.రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ జీఎం ఆనంద్‌కుమార్, పి.శ్రీనివాస్ (డిక్కి ప్రతినిధి), ఆంజనేయులు (సెంటర్ ఫర్ దళిత్‌స్టడీస్), వివిధ ఎస్సీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా, భూపంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు వచ్చేనెల 8న నల్లగొండలో రైతులతో కలసి తాను పాదయాత్ర (వాక్ ఫర్ ల్యాండ్ ప్రోగ్రామ్)ను నిర్వహస్తున్నట్లు పిడమర్తి రవి చెప్పారు. గతంలో నీటి వసతి ఉన్న భూమినే ఇవ్వగా ఇప్పుడు నీటి వసతి లేకపోయినా పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నామని ఎం.వి.రెడ్డి తెలిపారు. 

 

Election 2024

మరిన్ని వార్తలు