8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ

18 May, 2018 02:36 IST|Sakshi

బత్తిని మృగశిర ట్రస్టు కార్యదర్శి హరినాథ్‌ గౌడ్‌ వెల్లడి

హైదరాబాద్‌: ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సంబంధిత వ్యాధి రోగులకు బత్తిని మృగశిర ట్రస్టు ప్రతియేటా పంపిణీ చేసే చేప ప్రసాదాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జూన్‌ 8, 9 తేదీల్లో ఇవ్వనున్నట్లు ఆ ట్రస్టు కార్యదర్శి బి.హరినాథ్‌ గౌడ్‌ తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రస్ట్‌ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు.

ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో ప్రసాదం దొరకని వారికి మరుసటి రోజు దూద్‌బౌలి, కవాడిగూడ, కూకట్‌పల్లిలోని తమ కుటుంబీకుల నివాసాల వద్ద అందిస్తామన్నారు. శాకాహారులకు బెల్లంతోనూ, మాంసాహారులకు చేపతో ప్రసాదం ఇస్తామన్నారు. పంపిణీ కార్యక్రమానికి జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్,ఫైర్, పోలీస్, విద్యుత్‌ శాఖలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. రోగులందరికీ బద్రి విశాల్‌ పన్నాలాల్‌ పిట్టి ట్రస్టు, అగర్వాల్‌ సేవాదళ్‌ వారు భోజనం, మజ్జిగ, నీరు అందజేయనున్నారని తెలిపారు.  

ఏమీ తినకూడదు..  
చేప ప్రసాదం తీసుకునే వారు మూడు గంటల ముందు, తీసుకున్న గంటన్నర వరకూ ఏమీ తినకూడదని హరినాథ్‌ గౌడ్‌ సూచించారు. ప్రసాదం తీసుకున్న తర్వాత తాము ఇచ్చే మందును ఆరు మాత్రలుగా చేసి నీడలో ఎండబెట్టి ప్రతీ 15 రోజులకు ఒకసారి.. ఉదయం, రాత్రి వేళల్లో ఒక మాత్ర చొప్పున ఏమీ తినకముందు గోరువెచ్చని నీటితో వేసుకోవాలన్నారు. ఈ 45 రోజులు పథ్యం పాటించాలని అప్పుడే వ్యాధి పూర్తిగా తగ్గుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు