జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?

14 Sep, 2016 01:34 IST|Sakshi
జిల్లాల విభజన ఏ ప్రాతిపదికన?

హైదరాబాద్: ఏ ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తున్నారో అర్థం కావడం లేదని, ఇది ప్రజలను గందరగోళానికి గురి చేస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్  ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజన ప్రాతి పదికను ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదివాసీలకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి అభిప్రాయాలను చెప్పేందుకు నోటిఫికేషన్  ప్రక్రియ పూర్తి కాకముందే విభజన నిర్ణయాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీల ప్రాంతాల విషయంలో షెడ్యూల్ 5, భూరియా కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఆదివాసీలు అనేక రకాలుగా దోపిడీకి గురవుతున్నారని, 1/70 చట్టం అమలు కావడం లేదని అన్నారు. రాజ్యాంగంలో గిరిజనులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, కేసీఆర్‌కు నిజమైన ప్రేమ ఉంటే గిరిజనులకు ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలని డియాండ్ చేశారు.

సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యుడు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.. రాష్ర్టంలో 12 శాతం ఉన్న ఆదివాసీలు స్వయంపాలిత జిల్లాలు కావాలని ఎంతోకాలం నుంచి డిమాండ్ చేస్తున్నా, విస్మరించడం బాధాకరమన్నారు. విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. ముందు తరాల కోసం ప్రకృతి సంపదను కాపాడుతున్న ఆదివాసీల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

తెలంగాణ రాష్ర్ట సాధన కంటే ఇది ప్రజాస్వామికమైన డిమాండ్ అన్నారు. కెచ్చల రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, టీడీపీ రాష్ర్ట నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్, కరుణం రామకృష్ణ, ఆర్‌ఎస్పీ నాయకుడు జానకి రాములు, న్యూ డెమోక్రసీ నాయకుడు పోటు రంగారావ్, ఆదివాసీ నాయకులు వట్టం నారాయణ, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు ఝాన్సీ, సూర్యం, ఎం. హన్మేష్, గౌతం ప్రసాద్, ఎస్‌ఎల్ పద్మ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు