నిఘా లేకే దారుణాలు

16 Sep, 2013 09:03 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో : నవ దంపతులు.. వారాంతంలో దైవదర్శనం కోసం వచ్చారు... తిరిగి వెళ్తూ రోడ్డు పక్కగా ఆగడమే వారు చేసిన పాపం... కర్కశంగా దాడి చేసిన ముగ్గురు దుండగులు భర్త వెంకటేశ్వరరావును హతమార్చి, భార్య సౌజన్యపై హత్యాయత్నం చేసి దోచుకున్నారు. ప్రస్తుతం ఆ అభాగ్యురాలు ఐసీయూలోనే చికిత్స పొందుతోంది.

 సంఘీ టెంపుల్ దారిలో శనివారం జరిగిన దారుణమిది.

 నగర శివార్లలో సంఘీనగర్‌లో ఉన్న సంఘీ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆలయం వద్ద భద్రత విషయంలో ఢోకా లేకపోయినా... దానికి వెళ్లే దారి మాత్రం ‘ముళ్ల బాటే’. అనేకమంది భక్తులతో పాటు ప్రేమ పక్షులు నిత్యం ఇక్కడ కనిపిస్తుంటారు. వీరిపై దాడులు, దోపిడీలు నిత్యకృత్యమయ్యాయి. పోలీసుల గస్తీ, నిఘా ఉండాల్సిన స్థాయిలో లేకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.
 
 ఏకాంతం కోరుకోవడమే ఇబ్బంది


 సంఘీ ఆలయానికి వచ్చే దంపతులు, ప్రేమికులు  ఆ మార్గంమధ్యలో ఏకాంతంగా కాసేపు సేద తీరాలని కోరుకుంటుంటారు. ఇదే నేరగాళ్లకు అనువుగా మారుతోంది. కొన్ని ప్రాంతాలకు చెందిన యువకులు, పాత నేరగాళ్లు ఇక్కడ తిష్ట వేసి కనిపించిన వారిని అడ్డగిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. కంచే చేను మేసిన చందాన హోంగార్డులూ బెదిరింపులకు పాల్పడి వసూళ్లు చేసిన ఉదంతాలున్నాయి.

దంపతులపై జరిగిన నేరాలు బయటకు వచ్చినా... అనేక కారణాలతో ప్రేమికులు తమకు ఎదురైన అనుభవాలను సైతం బయటకు చెప్పుకోలేరు. ఇదే అసాంఘికశక్తులు, నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో సంఘీ మార్గంలో సాధారణ రోజుల్లో అవసరమైన స్థాయిలో, వారాంతాలు, సెలవు దినాల్లో పెట్రోలింగ్, నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.
 

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా