హడావుడి నిర్ణయాలు వద్దు

1 Apr, 2016 02:36 IST|Sakshi
హడావుడి నిర్ణయాలు వద్దు

రీడి జైనింగ్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత లక్ష్మణ్

 సాక్షి, హైదరాబాద్: 
ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని బీజేపీ శాసన సభాపక్ష నేత లక్ష్మణ్ పేర్కొన్నారు. భారీ అంచనాలు, పాత ప్రాజెక్టుల పునరాకృతుల నేపథ్యంలో ప్రజల్లో కొన్ని సందేహాలు రావడం సహజమేనని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో పునరావాసంపై కూడా భరోసా ఇవ్వాలన్నారు.

గురువారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రాణహిత ప్రాజెక్టు రద్దు నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు ఏ విధంగా నీటిని ఇస్తారో ఆ జిల్లా వాసులకు స్పష్టత ఇవ్వాలని కోరారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత బ్యారేజీ ఎత్తు తగ్గించినా భవిష్యత్తులో పెంచుకునేలా పునాదులు నిర్మించాలన్నారు. జల విధానంపై ముఖ్యమంత్రి అందరికీ అర్థమయ్యేలా ప్రదర్శన ఏర్పాటు చేసినందుకు అభినందించారు. కాగా తెలంగాణకు నీటి వినియోగంలో అదనపు హక్కులు పొందేలా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వద్ద గట్టిగా వాదనలు వినిపించాలని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ కోరారు.

>
మరిన్ని వార్తలు