హజ్‌ యాత్రికుల ఎంపిక పూర్తి

19 Mar, 2017 05:10 IST|Sakshi
హజ్‌ యాత్రికుల ఎంపిక పూర్తి

మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారులు ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ఈ ఏడాది మన దేశం నుంచి హజ్‌ వెళ్లేందుకు లక్షా 72 వేలమందికి సౌదీ అరేబియా ప్రభుత్వం అనుమతినిచ్చిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు అబ్దుల్‌ ఖయ్యూం ఖాన్‌ తెలిపారు. శనివారం నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌కు వెళ్లే యాత్రికులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...2017 హజ్‌ యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా 20,601 దరఖాస్తులు అందాయన్నారు. ఇందులో సాధారణ క్యాటగిరీలో 17,564, ఏ క్యాటగిరీలో 743, బీ క్యాటగిరీలో 2294 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

కేంద్ర హజ్‌ కమిటీ నిబంధనల ప్రకారం ఏ,బీ క్యాటగిరీలో దరఖాస్తు చేసుకున్న 3,037 మంది నేరుగా హజ్‌ యాత్రకు ఎంపికైయ్యారన్నారు. అనంతరం మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ మాట్లాడుతూ..ఈ ఏడాది హజ్‌ యాత్రికుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. 2017 హజ్‌ యాత్రకు ఎంపికైన వారు ఏప్రిల్‌ 5 లోపు మొదటి విడత రూ. 81 వేలు హజ్‌ రుసుమును కేంద్ర హజ్‌ కమిటీ పేరున డీడీ తీసి జమచేయాలని హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి తెలిపారు. ఏప్రిల్‌ 13వ తేదీ లోపు ఎంపికైన యాత్రికులు తమ పాస్‌పోర్టును రాష్ట్ర హజ్‌ కమిటీ కార్యాలయంలో అందించాలని కోరారు.

మరిన్ని వార్తలు