రిలీవైన విద్యుత్ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవద్దు

27 Apr, 2016 05:11 IST|Sakshi
రిలీవైన విద్యుత్ ఉద్యోగులను మళ్లీ చేర్చుకోవద్దు

సాక్షి, హైదరాబాద్: రిలీవైన 1,252 మంది ఏపీ ఉద్యోగులను మళ్లీ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో చేర్చుకుంటే సహాయ నిరాకరణకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్స్ సంఘాల సంయుక్త కమిటీ హెచ్చరించింది. రిలీవైన ఉద్యోగులను మళ్లీ తెలంగాణలో చేర్చుకుంటే పనివాతావరణం చెడిపోయే ప్రమాదముందని, వారితో కలసి పనిచేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఏ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు ఆ రాష్ట్రంలోనే పనిచేయాలని స్పష్టం చేసింది.

విద్యుత్ ఉద్యోగుల విభజనకు మోకాలడ్డుతున్న ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల వైఖరికి వ్యతిరేకంగా నాలుగు విద్యుత్ ఇంజనీర్ల సంఘాల సంయుక్త కమిటీ మంగళవారం విద్యుత్ సౌధలో నిరసన సభ నిర్వహించింది. తెలంగాణ విద్యుత్ రంగ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు మాట్లాడుతూ రిలీవైన ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థల్లో చోటు లేదని, ఏపీ ప్రభుత్వం తమ ప్రాంత ఉద్యోగులను ఆదరించి విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను తక్షణమే తెలంగాణకు కేటాయించాలని, విద్యుత్ ఉద్యోగుల విభజన ప్రక్రియను సత్వరం పూర్తి చేయాలని కోరారు.

4 నుంచి 7వ తరగతి(4/7) వరకు ఏ రాష్ట్రంలో చదివితే ఆ రాష్ట్ర స్థానికత  కలిగి ఉన్నారని నిర్థారించి విద్యుత్ ఉద్యోగుల విభజన చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నామని కొందరు ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పుట్టిన తేదీ ఆధారంగానే స్థానికతను నిర్థారించి విభజన నిర్వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల మనోభావాల మేరకే ఉద్యోగుల విభజన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పేర్కొన్నారు. నిరసన సభలో పాల్గొన్న ఉద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శాంతియుతంగానే నిరసనలు తెలపాలని సూచించారు.
 
 సుప్రీంలో అప్పీల్ చేయాలి
 రిలీవైన 1,252 మంది విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ విద్యుత్ సంస్థలే 100 శాతం జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని విద్యుత్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంలో అప్పీల్ చేస్తామని ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీని విస్మరించిన యాజమాన్యాలు రిలీవైన ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేశాయని ఓ సీనియర్ ఇంజనీర్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ నిర్ణయం సరికాదన్నారు. అప్పీల్ విషయంలో తెలంగాణ యాజమాన్యాలను ఒప్పించడంలో విఫలమైన ఉద్యోగ సంఘాలు సోమ, మంగళవారాల్లో పోటాపోటీగా నిరసనలు, ధర్నాలు చేయడం ఎందుకని కొందరు తెలంగాణ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు