ఇష్టం వచ్చిన సలహాలివ్వొద్దు:చంద్రబాబు

19 Aug, 2014 01:47 IST|Sakshi
ఇష్టం వచ్చిన సలహాలివ్వొద్దు:చంద్రబాబు

* టీడీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలతో చంద్రబాబు
* ఇష్టారీతిన వ్యవహరిస్తే మీరు, నేను ఉండం
* మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మారకుంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తా
* టీడీపీకి హత్యా రాజకీయాల చరిత్ర లేదు
* ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపే ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ ఆ అంశాన్ని సభలో ప్రస్తావించింది
* సభలో తొలిరోజు వైఎస్సార్ సీపీని సమర్థంగా ఎదుర్కోలేకపోయూం
* రుణ మాఫీకి ఒకటిన్నర నుంచి రెండు నెలలు పట్టవచ్చు

 
సాక్షి, హైదరాబాద్: ‘‘నేను వింటున్నాను కదా అని ఇష్టం వచ్చిన  సలహాలు ఇవ్వకండి. మన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే మీరు ఉండరు. నేనూ ఉండను. జాగ్రత్తగా పనిచేయండి’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తెలుగుదేశం శాసన సభాపక్షం (టీడీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలను హెచ్చరించారు.  ఈ సమావేశం అసెంబ్లీ లాంజ్‌లో చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటలపాటు జరిగింది.
 
అక్టోబర్ 2 నుంచి వృద్ధులు, వికలాంగుల పింఛన్లను కార్యకర్తల ద్వారా అందిద్దామని ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. నేను వింటున్నాను కదా అని ఇష్టం వచ్చినట్లు సలహాలు ఇవ్వొద్దని స్పష్టంచేస్తూ పై వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పింఛన్లు, మొదలైన వాటిని పంపిణీ చేసే బాధ్యతను ప్రభుత్వ ఉద్యోగికి అప్పగిద్దామని చంద్రబాబు చెప్పారు.
 
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అందజేసిన సమాచారం ప్రకారం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడు మిషన్లు, వివిధ అంశాలపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లోని వివరాలు, తెలంగాణ సీఎం కె. చంద్ర శేఖర్‌రావుతో ఆదివారం జరిగిన చర్చల వివరాలను బాబు సుదీర్ఘంగా వివరించారు. పనితీరును బట్టి మంత్రులు, ఎమ్మెల్యేలకు గ్రేడింగ్ ఇస్తానన్నారు. కొందరు మంత్రుల పనితీరు బాగోలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. మంత్రులందరి పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నానని, కొందరికి 12 నుంచి 38 శాతం మాత్రమే మార్కులు వచ్చాయని చెప్పారు.
 
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు మారకుంటే ప్రత్యామ్నాయం ఆలోచిస్తానని హెచ్చరించారు. గతంలో అధికారుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని, అప్పట్లో పనిచేసిన  అధికారులు ఆ తరువాత కనపడటం కూడా మానేశారని, కొందరు మొహం పక్కకు తిప్పుకుని వెళ్లారని చెప్పారు. అందువల్లే ఈసారి కార్యకర్తలకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆదివారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) మధ్య సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ పడుతున్న ఇబ్బందులను కేసీఆర్ కూడా అర్థం చేసుకున్నారని తెలిపారు. ఏపీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన కూడా సహకారం అందించే పరిస్థితి వచ్చిందన్నారు.
 
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేసీఆర్ కూడా అన్నారని చెప్పారు. టీడీపీకి హత్యా రాజకీయాల చరిత్ర లేదని చెప్పారు. ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్ సీపీ శాసన సభలో ఆ అంశాన్ని ప్రస్తావించిందన్నారు. అయినా జగన్‌మోహన్‌రెడ్డికి సభలో మైక్ ఇవ్వటం మన వ్యూహ లోపమని అన్నారు. సభలో తొలిరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సమర్థ్ధంగా అడ్డుకోలేకపోయామని, ఇక ముందు అలా కాకుండా చూసుకోవాలని చెప్పారు. రుణ మాఫీకి ఒకటిన్నర నుంచి రెండు నెలలు సమ యం పట్టే అవకాశముందని తెలిపారు.
 
శాంతిభద్రతలకు ప్రభుత్వం తొలి ప్రాధాన్యత: కాలువ శ్రీనివాసులు
ప్రభుత్వానికి శాంతి భద్రతలే తొలి ప్రాధాన్యత అని చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు టీడీఎల్పీ భేటీ  తరువాత మీడియాకు చెప్పారు.  సోమవారం శాసన సభలో వైఎస్సార్ సీపీ పక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును టీడీఎల్పీ సమావేశం ఖండించిందని తెలిపారు.

మరిన్ని వార్తలు