ఆపుతారో... ఊపుతారో!

25 Feb, 2015 23:42 IST|Sakshi
ఆపుతారో... ఊపుతారో!

కొత్త రైళ్ల కల నెరవేరేనా?
నేడు రైల్వే బడ్జెట్

 
సిటీబ్యూరో: మహా నగర ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తున్న బడ్జెట్ రైలు పట్టాల పైకి రాబోతోంది. మరి కొద్దిసేపట్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. నగర వాసులు ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా రైల్వే బడ్జెట్  కోసం ఎదురు చూస్తున్నారు. లక్షలాది మంది ప్రయాణికుల ఆకాంక్షలకు అనుగుణంగా ‘ఆశల రైళ్లకు’ పచ్చజెండా ఊపుతారో... యధావిధిగా ఎర్రజెండా చూపుతారో తేలిపోనుంది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య ప్రధాన కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ నుంచి నిత్యం 3 లక్షల మందికి పైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వందలాది ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్ రైళ్లతో పాటు నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు  ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి.విశాఖ, తిరుపతి వంటి రూట్లలో కొత్త రైళ్లను ప్రవేశపెట్టినప్పటికీ ఇంకా డిమాండ్ ఉండనే ఉంది. హైదరాబాద్ నుంచి వివిధ పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలకు వెళ్లే భక్తుల కోసం మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకు రావాలనే ప్రతిపాదన చాలా కాలంగా పెండింగ్ జాబితాలో ఉంది. ఏటా వేలాది మంది అజ్మీర్ దర్గాకు వెళ్తారు. అలాగే షిరిడీ, శబరికి వెళ్లే భక్తుల రద్దీ అనూహ్యంగా పెరుగుతోంది. ఈ సంఖ్యకు తగినట్టు రైళ్లు పెరగడం లేదు. ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
కొత్త లైన్‌లు...

ప్రస్తుతం వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ లైన్‌ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు మొదలయ్యాయి. కానీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైల్వే మార్గం విషయమై ఏడాదిగా ప్రతిష్టంభన  కొనసాగుతూనే ఉంది. దీనిపై ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు ఇప్పుడు ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసులకు ప్రత్యేక లైన్‌లు లేకపోవడం వల్ల అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి. శంకర్‌పల్లి-పగిడిపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మించడం వల్ల గూడ్సు రైళ్లను  ఆ దిశలో మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ మార్గంలో గూడ్సు రైళ్ల ఒత్తిడి తగ్గి ఎంఎంటీఎస్‌కు అవకాశాలు పెరుగుతాయి. అలాగే మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 150 కిలోమీటర్ల కొత్త మార్గం వేయవలసి ఉంది. నగరం నుంచి మహబూబ్‌నగర్‌కు కొత్త లైన్‌లు వేయాలనే ప్రతిపాదన కూడా పెండింగ్‌లోనే ఉంది. మరోవైపు సికింద్రాబాద్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు వట్టినాగులపల్లి, మౌలాలీల్లో భారీ ప్రయాణికుల టెర్మినళ్లను నిర్మించాలన్న ప్రతిపాదనలూ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ  దిశగా ఏమైనా కదలిక, పురోగతి ఉంటాయా, లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.

కొండెక్కిన ‘ముష్కిల్ ఆసాన్’

ప్రయాణికుల చెంతకే రిజర్వేషన్  బుకింగ్ సదుపాయం అన్న లక్ష్యంతో 2010లోనే ‘ముష్కిల్ ఆసాన్’ అనే పథకానికి ప్రతిపాదనలు రూపొందించారు. కానీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. సికింద్రాబాద్‌లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు  ప్రణాళికలను రూపొందించారు. కానీ అంగుళం కూడా ముందుకు కదల్లేదు. రిజర్వేషన్  బుకింగ్ కార్యాలయాల వద్ద రద్దీ వల్ల, ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోవడం వంటి ప్రతికూలతలను అధిగమించేందుకు ప్రయాణికుల వద్దకే సంచార రిజర్వేషన్ కేంద్రాలను తీసుకెళ్లాలనేది ఈ పథకం లక్ష్యం.
 
ఈ మార్గాల్లో రైళ్లు అవసరం

జంట నగరాల నుంచి సుమారు 100 నుంచి 120 ప్రధాన రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి.
విశాఖ, తిరుపతి, బెంగళూరు, షిరిడీ, తిరువనంతపురం, అజ్మీర్‌లకు మరిన్ని కొత్త రైళ్లకు డిమాండ్ ఉంది.
కాచిగూడ నుంచి బెంగళూర్‌కు 2 ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రూట్‌లో మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది.
నగరం నుంచి షిరిడీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. కాకినాడ నుంచి నేరుగా షిరిడీ వరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. కానీ ఇది వారానికి రెండు రోజులే నడుస్తుంది. ఈ రూట్‌లో హైదరాబాద్ నుంచి మరో రైలు నడపాలనే డిమాండ్ ఉంది.
{పస్తుతం అయ్యప్ప భక్తుల కోసం శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. నగరం నుంచి తిరువనంతపురానికి మరో ఎక్స్‌ప్రెస్ తప్పనిసరి.
వరంగల్, మిరియాలగూడ, మణుగూర్‌ల నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. తెలంగాణలోని మిగతా జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ఇంటర్‌సిటీ సర్వీసులతో రవాణా సదుపాయం మెరుగుపర్చవలసిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు