మద్యం తాగి.. తప్పుదోవ పట్టించి..

1 Apr, 2014 09:53 IST|Sakshi
ఆదివారం అర్థరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద జనం

పూటుగా మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు చిక్కాడు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షకు నిరాకరించడంతో అతన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లారు .. ఇక అంతే.. తనపై పోలీసులు దాడి చేశారని హడావిడి చేసి అందరినీ తప్పుదోవ పట్టించాడు. ఈక్రమంలో కొంత మంది ఆదివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌పై రాళ్లతో దాడి చేసి అడ్డొచ్చిన ఇద్దరు ఎస్సైలపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు సోమవారం సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా పలువురిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు.
 
 వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి అల్వాల్ ట్రాఫిక్ ఎస్సై పురుషోత్తం సిబ్బందితో కలిసి పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ సమీపంలో డ్రంకన్ డ్రైవ్ విధి నిర్వహణలో ఉన్నారు. ఈ క్రమంలో రాత్రి 10.30 గంటలకు ఎర్రగడ్డకు చెందిన జగదీష్ తయార్(50) మద్యం తాగి కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అతన్ని బ్రీత్ ఎనలైజ్ పరీక్ష చేసేందుకు యత్నించగా అందుకు నిరాకరించాడు. దీంతో లా అండ్ ఆర్డర్ ఎస్సై తిరుపతి సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా జగదీష్‌కు పరీక్ష చేయగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నమోదైంది.
 
 అయితే, జగదీష్ తన పేరుకు బదులు పక్క సీట్లో కూర్చున్న సురేష్ అగర్వాల్ పేరును తన పేరుగా చెప్పాడు. అంతే కాకుండా తనపై పోలీసులు దాడి చేస్తున్నారని.. వచ్చి కాపాడండంటూ కొంపల్లి థోలారిధనిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడు. ఇక అంతే.. నాలుగు బస్సుల్లో తిరుగు ప్రయాణంలో ఉన్న వారంతా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని రాళ్లతో దాడి చేసి అడ్డుకున్న ఎస్సై పురుషోత్తం, తిరుపతిపై దాడికి దిగారు.
 
 ఇలా అర్ధరాత్రి 1.30 గంటల వరకు స్టేషన్ ఆవరణలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరిని మందలించినా దాడి చేసేందుకు సిద్ధంగా ఉండడంతో పోలీసులు సంయవనం పాటించారు. అప్పటికే విషయం తెలుసుకున్న బాలానగర్ డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావులు వారిని సముదాయించి అక్కడ నుంచి పంపించారు. జరిగిన ఘటన ను పోలీసులు సీరియస్‌గా తీసుకుని గొడవకు కారకుడైన జగదీష్‌పై కేసు నమోదు చేయడమే కాకుండా సీసీ పుటేజీ ఆధారంగా మరి కొంత మందిపైనా కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు సీఐ ప్రవీందర్‌రావు తెలిపారు.

మరిన్ని వార్తలు