మహిళలకు డ్రైవింగ్‌లో శిక్షణ

8 Nov, 2013 04:41 IST|Sakshi


= స్త్రీలపై అఘాయిత్యాలను అరికట్టేందుకే..
 = జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడి

 
సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని నిరుద్యోగ మహిళ లకు డ్రైవింగ్‌లో, సెక్యూరిటీగార్డులుగా శిక్షణనిస్తామని, శిక్షణ పొందిన వారిలో 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు. ఇందుకుగాను ఎన్జీఓలతో కలిసి డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభివృది ్ధపనులపై గురువారం మేయర్, కమిషనర్  ఆయా పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్యాబ్స్‌లో వెళ్తున్న మహిళలపై అభయ తరహా ఘటనలు జరగుతున్నందున, మహిళాడ్రైవర్లే ఉంటే ఇలాంటివి కొంతమేర నివారించవచ్చునని అభిప్రాయపడ్డారు. బ్యాంకు లింకేజీలు, దీపం, బంగారు తల్లి, వడ్డీలేని రుణం, అభయహస్తం తదితర కార్యక్రమాలపై మహిళలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్‌సీ/ ఎస్‌టీ సబ్‌ప్లాన్ కింద మంజూరైన పనులను త్వరిత గతిన పూర్తిచేయాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించారు.

విద్యుత్ బల్బుల్ని బయట అమ్ముకోకుండా ఉండేందుకు వాటిపై జీహెచ్‌ఎంసీ లోగోను ముద్రించాల్సిందిగా సూచించారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన ప్రాంతాల్లో టైమర్ల ఏర్పాటు కోసం టెండ ర్లు ఆహ్వానించాల్సిందిగా సూచించారు. వెటర్నరీ ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ సూచించారు. హెచ్‌ఎంఆర్‌కు అప్పగించిన మొఘల్‌సరాయిని జీహెచ్‌ఎంసీకి తిరిగి అప్పగించాల్సిందిగా ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందిగా ఫ్లోర్‌లీడర్లు కమిషనర్‌ను కోరారు. ఇంకా, తమ గౌరవ వేతనాల్ని పెంచాల్సిందిగా కోరారు.
 
స్టాండింగ్ కమిటీ సమావేశంలో...

అంతకు ముందు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయా పనులకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే అదనపు నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం తెలిపారు. క్యాపిటల్ పనులకు 400 శాతం, రెవెన్యూ పనులకు 300 శాతం అదనంగా కేటాయించేందుకు అంగీకరించారు. శ్మశానవాటికల అభివృద్ధికి కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. నవయుగ సెజ్ నుంచి చందానగర్ రైల్వేస్టేషన్ వరకు రోడ్డు అభివృద్ధికి రూ. 8.25 కోట్లు మంజూరుకు ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ రోడ్డు వల్ల ఎక్కువమందికి ప్రయోజనం ఉండదని అడ్డుకున్నారు. పాతబస్తీలో ఎక్కువమందికి అవసరమైన పనులెన్నో ఉన్నాయన్నారు. దీంతో, కాంగ్రెస్, ఎంఐఎం సభ్యుల మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది.
 

>
మరిన్ని వార్తలు