‘మత్తు’ దిగిపోతోంది?

19 Jul, 2017 00:45 IST|Sakshi
‘మత్తు’ దిగిపోతోంది?
నీరుగారిపోతున్న డ్రగ్స్‌ కేసు!
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొద్దిరోజులుగా సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు నీరుగారిపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు, వివిధ రంగాల వారేగాకుండా పెద్ద సంఖ్యలో సినీ ప్రముఖులకు ఈ వ్యవహారంలో భాగస్వామ్యం ఉందని వెల్లడైనా.. చివరికి తూతూమంత్రంగానే ముగించేస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేని ఒక ప్రముఖ దర్శకుడిని, మరో హీరోను మాత్రమే టార్గెట్‌గా చేసి విచారణ జరగబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

డ్రగ్స్‌ వ్యవహారంలో 19 మంది సినీ ప్రముఖుల పేర్లను గుర్తించిన సిట్‌.. అందులో పెద్ద చేపలను వదిలేసి, 12 మందికే నోటీసులు జారీ చేసిందని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులోనూ ఇద్దరిపై మాత్రమే చట్టపరమైన చర్యలు తీసుకుని.. కేసును పక్కనపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంలో ముమైత్‌ఖాన్‌కు సిట్‌ నోటీసులు జారీ చేసినా.. కొందరు సినీ పెద్దల ఒత్తిడి మేరకు ఆమెకు మినహాయింపు ఇచ్చినట్టు తెలుస్తోంది. కాగా పూర్తిస్థాయి ఆధారాలు ఉంటేనే సినీ ప్రముఖులెవరినైనా అరెస్టు చేస్తామని ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్‌ మంగళవారం వెల్లడించారు.
 
వరుసగా విచారణ
డ్రగ్స్‌ వ్యాపారి కెల్విన్‌ ఫోన్‌కాల్‌ డేటా, విచారణలో అతను చెప్పిన అంశాల ఆధారంగా పలువురు సినీ ప్రముఖులకు ఎక్సైజ్‌ సిట్‌ ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వారిని ఈ నెల 19వ తేదీ నుంచి సిట్‌ విచారించనుంది. 19న పూరీ జగన్నాథ్, 20న ఛార్మి, 21న ముమైత్‌ ఖాన్, 22న సుబ్బరాజు, 23న శ్యాం కె.నాయుడు, 24న రవితేజ, 25న ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, 26న నవదీప్, 27న తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందు సిట్‌ ఎదుట హాజరుకావాల్సి ఉంది.
 
ఛార్మి విదేశాల్లోనే..
రెండో రోజున విచారణకు హాజరుకావాల్సిన ఛార్మి విదేశాల్లోనే ఉన్నట్లు సమాచారం. ఐపీసీ నిబంధనల ప్రకారం ఎవరైనా మహిళను విచారించాలంటే... ఆమె కోరిన లేదా ఆమెకు అనుకూలంగా ఉన్న చోటనే విచారించాలి. ఈ లెక్కన సిట్‌ బృందం ఎలా విచారిస్తుందనే దానిపై స్పష్టత లేదు.
 
ఇక నోటీసులు అందుకున్న మిగతా సినీ ప్రముఖులు కూడా సిట్‌ విచారణకు హాజరుకావాలా, వద్దా.. హాజరైతే ఎలా వ్యవహరించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది. ఐపీసీ నిబంధనల ప్రకారం.. తమ న్యాయవాదితో కలసి విచారణకు హాజరుకావచ్చు. దీంతో వారంతా మంచి న్యాయవాదులను వెతికిపట్టుకుని సలహా తీసుకుంటున్నారని, వారితో కలసి విచారణకు హాజరవుతారని సమాచారం.
 
ముమైత్‌కు మినహాయింపు!
బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో సిట్‌ ఎదుట హాజరు నుంచి ముమైత్‌ఖాన్‌కు మినహాయింపు లభించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎక్సైజ్‌ శాఖ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈ నెల 21 ఆమె సిట్‌ ముందు విచారణకు రావాలి. కానీ ఆమె పుణేలో జరుగుతున్న బిగ్‌బాస్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ కార్యక్రమం నిబంధనల ప్రకారం.. 70 రోజుల పాటు బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటికి రాకూడదు. ఒకవేళ ఆమె విచారణకు హాజరుకాకుంటే సిట్‌ అధికారులు బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లి అరెస్టు చేయవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆమెకు విచారణ నుంచి మినహాయింపు లభించినట్లు ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఆమె స్థిర నివాసాన్ని గుర్తించి నోటీసులివ్వటంలో ఎౖMð్సజ్‌ అధికారులు విఫలమయ్యారని కూడా అంటున్నారు.