జోష్..క్రాష్

12 Jul, 2016 23:42 IST|Sakshi
జోష్..క్రాష్

సిటీలో పగటిపూటా జోరుగా డ్రంకన్ డ్రైవింగ్
‘హ్యాపీ అవర్స్’తో కొత్త చిక్కులు మైనర్లు, యువతే అధికం
ఈ ఏడాది ఇప్పటి వరకు పగలు చిక్కింది..763 మంది

 
మద్యం వ్యాపారులు ‘హ్యాపీ అవర్స్’గా పిలుచుకుంటున్న గడియలు...ఇప్పుడు అమాయకులకు డెత్ అవర్స్‌గా మారుతున్నాయి. సిటీలో పగలే పూటుగా మద్యం తాగి...అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది యుక్తవయస్కులే హ్యాపీ అవర్స్‌లో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇతరుల ప్రాణాలూ తీస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్‌లో జరిగిన చిన్నారి రమ్య మృతికి కారణమైన...కారును నడుపుతున్న శ్రావెల్ 21 ఏళ్ళ లోపు యువకుడు. పట్టపగలు ఫుల్లుగా మద్యం తాగి, విచక్షణా రహితంగా డ్రైవింగ్ చేసి నాలుగు కుటుంబాల్లో విషాదం నింపాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు యువత జోష్‌తో జరుగుతున్న ప్రమాదాల్నీ.. పబ్స్ / బార్లలో అమలులో ఉన్న ‘హ్యాపీ అవర్స్’ మరో కోణాన్నీ ఆవిష్కరించాయి. - సాక్షి, సిటీబ్యూరో
 
 
మద్యం జీవితాలను చిత్తు చేస్తోంది. అమ్మకాలు పెంచుకునేందుకు మద్యం వ్యాపారులు ప్రకటించే ‘ఆఫర్లు’ యువతను చిదిమేస్తున్నాయి. తాగిన మైకంలో యువత జోష్ కోసం చేసే పనులు.. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. మరోపక్క మద్యం వ్యాపారులు అమ్మకాలను పెంచుకునేందుకు చేస్తున్న చర్యలు ‘డెత్’ బెల్స్‌ను మోగిస్తున్నాయి. పది రోజుల క్రితం పంజ గుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు ఆమె చిన్నాన్నను సైతం పొట్టనబెట్టుకుంది. తల్లిని ఆస్పత్రి పాల్జేసింది. ఈ ఘటనకు కారణమైన శ్రావెల్ 21 ఏళ్ల లోపు యువకుడే. గడిచిన కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారిలో యువతే అధికం.  సిటీలో జరిగిన ప్రమాదాలు, గణాంకాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..     - సాక్షి, సిటీబ్యూరో
 
 
 ప్రపంచ వ్యాప్తంగా యువతను ఎక్కువగా బలి తీసుకునేవి రోడ్డు ప్రమాదాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. అందులో 30 శాతం మంది 15-30 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని స్పష్టం చేసింది. ఇలా ప్రమాదాల్లో ఏటా కనిష్టంగా 3.5 లక్షల యువత మరణిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని పరిస్థితులూ దీనికి భిన్నం కాదు. ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో యువత, ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు (యువత ఎక్కువగా వినియోగించేవి) ఎక్కువ. అజమాయిషీ లేకపోవడం, పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం, పటిష్ట చట్టాలు లేకపోవడంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.
 
 
 
టీనేజర్లు.. టూవీలర్లు
నగరంలో ఏటా నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నట్టు తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తరవాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు ఉన్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నవి, బారిన పడుతున్నవి కూడా ఈ తరహా వాహనాలే. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహన చోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చాలా విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు జోష్ కోసం చేసే రేసింగ్స్ కూడా యువతను బలి తీసుకుంటోంది.
 
 
 పటిష్ట చట్టాలు కరువు..
 సిటీలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. రహదారులపై వాహనాల కనిష్ట వేగం గంటకు 18 కి.మీ. మించడం లేదు. అయితే, ఇటీవల కాలంలో వచ్చిన వాహనాల వేగం గంటకు 200 కి.మీ.పై ఉంటోంది. దీంతో యువత దానిపై దూసుకుపోతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యానికి మించిన వాహనాలు కుప్పలు తెప్పలుగా వస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని అడ్డుకోవడానికి అవసరమైన చట్టాలు, నిబంధనలు మాత్రం లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 
 
తల్లిదండ్రుల పాత్ర కొంత..
యాంత్రిక జీవనయానంలో పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండట్లేదన్నది ట్రాఫిక్ పోలీసుల మాట. దీంతో యువకులు మరింత రెచ్చిపోతున్నారు. పిల్లలకు మైనార్టీ తీరకుండా, లెసైన్స్ లేకుండా వాహనాలు కొనిచ్చి తల్లిదండ్రులు ‘ప్రేమను’ చాటుకుంటున్నారు. వీరు పరోక్షంగా పిల్లల విచ్చలవిడి తనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బైక్, కార్ రేసింగ్‌లు.. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్, దాని సమీపంలో ఉన్న మార్గాలకు చేరాయి. వీటిని గణించే, అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం మాత్రం అదుబాటులో లేదు. ఉన్న వాటినీ సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వ శాఖలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు కారణమై కడుపుకోత మిగులుతోంది.  
 
నిబంధనలు చెప్పేది ఇదీ..
భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడపవచ్చు. 18 ఏళ్లు నిండిన తరవాత మాత్రమే గేర్స్ ఉన్న వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లెసైన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లెసైన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. అంటే ఎవరికైనా మన వాహనాన్ని ఇవ్వాలంటే తొలుత వారు మేజరేనా? డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? అనేవి తెలుసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన లేకపోవడం, వాటి అమలుపై యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో ఎన్నో ‘ఇంటి దీపాలు’ చిన్న వయసులోనే ఆరిపోతున్నాయి.
 
విదేశాల్లో అయితే ఇలా..
మానవ జీవితానికి పాశ్చాత్య దేశాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ నిబంధనలు సైతం కఠినంగా ఉంటాయి. ఆ రోడ్లపైకి ఎవరైనా డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడుపుతూ వస్తే తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటారు. మైనర్లు చోదకులుగా ఉంటే వారితో పాటు.. తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురికీ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీగా ఉండటమే కాదు.. ఎవరైనా మూడు ఉల్లంఘనలకు మించి పాల్పడితే వారి లెసైన్స్‌ను సైతం రద్దు చేస్తారు. ఇలా ఓసారి లెసైన్స్ రద్దు అయితే మళ్లీ మంజూరు కావడం అనేది దుర్లభం.
 

హ్యాపీ అవర్స్‌తో డెత్ బెల్స్
మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగేది సాయంత్రం తర్వాతే. పగటిపూట ఈ విక్రయశాలలన్నీ దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అనేక బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ వ్యాపారం పెంచుకోవడానికి ‘హ్యాపీ అవర్స్’ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీని ప్రకారం బార్/పబ్ తెరిచిన తర్వాత సాయంత్రం 6 గంటల కంటే ముందు మద్యం సేవించే వారికి ‘1+1’ తరహా ఆఫర్లు ఇచ్చి మందుబాబుల్ని ‘ప్రోత్సహిస్తున్నాయి’. రమ్య మృతికి కారణమైన శ్రావెల్ సైతం మధ్యాహ్నమే ‘హ్యాపీ అవర్స్’లో మద్యం తాగి కారుతో రోడ్డు పైకి వచ్చాడు. డ్రైవింగ్‌పై పట్టు కోల్పోయి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు. సైబరాబాద్ ఈస్ట్ అధికారులు ఆదివారం ఒక్కరోజు పగటి పూట జరిపిన తనిఖీల్లో 39 మంది మందుబాబులు వాహనాలు నడుపుతూ చిక్కారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో 763 మంది పట్టుబడటం ఆందోళన కలిగించే అంశం.
 
 
 
యువత పాల్పడే ఉల్లంఘనలు..
యూత్‌తో పాటు మైనర్లు ఎక్కువగా 12 రకాలైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. వీటిలో ఎనిమిది వైలేషన్స్ వల్ల వారితో పాటు ఎదుటి వారికీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవి..
 
డ్రంకెన్ డ్రైవింగ్   హెల్మెట్ లేకపోవడం
సిగ్నల్ జంపింగ్   ఓవర్ స్పీడ్   ర్యాష్ డ్రైవింగ్   సెల్‌ఫోన్/ఇయర్‌ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్   రాంగ్ సైడ్ డ్రైవింగ్   ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్లు లెసైన్స్/ఆర్సీలు లేకుండా వాహనం నడపడం  ధ్రువీకరణలు దగ్గర పెట్టుకోకుండా డ్రైవింగ్
 
 

మరిన్ని వార్తలు