చారిత్రక వైభవం కళావిహీనం

11 Aug, 2015 00:03 IST|Sakshi
చారిత్రక వైభవం కళావిహీనం

శిథిలమవుతున్న వారసత్వ భవనాలు  కాపాడుకోవాలంటున్న నిపుణులు
 
ఒక మట్టికోట  మహానగరమైంది. నాలుగు వందల ఏళ్ల  ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు. మరెన్నో కళాత్మక, సృజనాత్మక నిర్మాణాలు కాలగమనానికి తార్కాణాలుగా నిలిచాయి. హైదరాబాద్ చారిత్రక సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండో అరబిక్, ఇండో యూరోపియన్, ఇండో సర్‌సానిక్ శిల్ప రీతుల్లో గొప్ప భవనాలు వెలిశాయి. అప్పట్లో  నిజాం నవాబులు కట్టించిన ప్యాలెస్ నుంచి.. బడి, మసీదు, ఆసుపత్రి, ఏదైనా సరే అద్భుత కళాఖండాలై విలసిల్లాయి. అలాంటి ఘన చరితకు నిదర్శనమైన సౌధరాజాలపై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి.

శతాబ్ద కాలానికి చేరువైన ఉస్మానియా ఆసుపత్రి మూడు దశాబ్దాలకు పైగా ఎలాంటి ఆలనా, పాలనకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఇలాగే నగరంలోని అనేక వారసత్వ భవనాలు అలాంటి స్థితికి చేరువయ్యాయి. దేవిడీలు, ప్యాలెస్‌లు, మహళ్లు, పరిపాలన భవనాలు, నివాస సముదాయాలు, ఆసుపత్రులు, విద్యా మందిరాలు వంటి చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించుకోవలసిన తరుణం ఇది. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.  - సాక్షి,సిటీబ్యూరో
 
వెలుగు జిలుగుల వైభవాలు..
కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు భాగ్యనగరంలో గుర్తించిన చారిత్రక కట్టడాలతో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ సుమారు 170  భవనాలను చారిత్రక, వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది.వాటిలో కొన్ని బాగానే ఉన్నా, మరికొన్ని పెచ్చులు ఊడిపోతూ శిథిలమవుతున్నాయి. ఈ దశలోనే వాటిని పరిరక్షించుకోకపోతే మరికొన్నేళ్లలో పూర్తిగా శిథిలం కావచ్చు. ఉస్మాన్ అలీఖాన్ 1919 నుంచి 1925 మధ్య కాలంలో మూసీనది ఒడ్డున పటిష్టమైన భవనాలను కట్టించారు. పటిష్టమైన డంగు సున్నంతో, ఎంతో  కళాత్మకంగా చెక్కిన రాళ్లతో నిర్మించిన నిలువెత్తు కట్టడాలివి. హైకోర్టు, సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి వంటి పెద్ద భవనాలు అలా ఏర్పాటైనవే. ఈ భవనాలన్నీ చారిత్రక సౌందర్యాన్ని సంతరించుకున్నవే. పెద్ద పెద్ద మినార్‌లు, అందమైన ఆనియన్ డోమ్‌లు, గుమ్మటాలు, గోడలపై అదంగా చెక్కిన లతలు హైదరాబాద్ అందాన్ని ఇనుమడింపజేశాయి.
 
ఒకనాటి ‘న్యూ జెనీవా’  నేటి మహబూబియా పాఠశాల
 నిజాం నవాబు మహబూబ్ అలీఖాన్ బాలికల కోసం ఒక పాఠశాల  ఉండాలని సూచించారు. ఆయన ఆదేశాల మేరకు గన్‌ఫౌండ్రిలో పూర్తిగా రాయి ఉపయోగించి ఓ భవనం నిర్మితమైంది. ఇది 1907లో అందుబాటులోకి వచ్చింది. ఇండో యురోపియన్ శైలిలో  ఇది నిర్మితమైంది. మొదట్లో ఈ పాఠశాలకు ‘న్యూ జెనివా’ అని నామకరణం చేశారు. తన పేరు పెట్టేందుకు నిజాం అంగీకరించడంతో ఆ తరువాత ‘మహబూబియా’ పాఠశాలగా మారింది. ప్రస్తుతం శిథిలమవుతున్న ఈ భవనంలో కొన్ని తరగతి గదులను ఖాళీ చేశారు. అక్కడక్కడ రాళ్లు కూలిపోయాయి. గోడలు కూలిపోతున్నాయి.  
 
 నాటి ప్యాట్రిక్ రెసిడెన్సీ..  నేటి కోఠి ఉమెన్స్ కాలేజీ
ఇప్పటి ‘కోఠి ఉమెన్స్ కాలేజీ’ ఒకప్పటి బ్రిటిష్ రెసిడెంట్ కిర్క్ ప్యాట్రిక్ నివాసం. మూసీనదికి ఉత్తరాన 34 ఎకరాల  క్షేత్రంలో కట్టించిన అద్భుతమైన భవనం. ైహైదరాబాద్ మధ్య యుగ సంస్కృతిపై ఆధునిక పాశ్చ్యాత్య రీతిని ప్రతిబింబించిన కట్టడం ఇది. పలాడియన్ జార్జియన్ నిర్మాణ శైలిలో నిర్మితమైంది. ఎంతో హుందాగా కనిపించే ఈ భవనం పైకప్పు శిథిలమైంది.  
 
ఇండో సర్‌సానిక్ శైలిలో  సిటీ కాలేజ్..
మహబూబ్ అలీఖాన్ హయాం (1865)లో కట్టించిన ‘దార్-ఉల్-ఉలుమ్’ మదరస్సా (పాఠశాల) ఉస్మాన్ అలీఖాన్ కాలంలో 1924 నాటికి సిటీ హైస్కూల్‌గా మారింది. ఆ తరువాత ‘సిటీ కాలేజ్’గా అభివృద్ధి చెందింది. సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన తరగతి గదులు, వరండాలు, నిలువెత్తు ఆర్చ్‌లు, ఆనియన్ డోమ్‌లతో అద్భుత నిర్మాణం ఈ భవనం. ఎండాకాలంలోనూ చల్లగా ఉండే ఈ భవనం ఇండో సర్‌సానిక్ వాస్తుశైలిలో రూపుదిద్దుకుంది. అప్పట్లో దీనికి రూ. 8 లక్షలు ఖర్చయినట్లు అంచనా. ఈ భవనం ఇప్పుడు రంగు వెలసి కళావిహీనంగా మారింది. పైకప్పులో వర్షపు నీరు చేరుతోంది. పెచ్చులూడుతోంది. గోడలకు నిమ్ము చేరి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి.
 
‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’  నేటి ఈఎన్‌టీ ఆసుపత్రి
కోఠి బ్యాంక్ స్ట్రీట్‌లో ఎంతో అందంగా కనిపించే ప్రస్తుత ఈఎన్‌టీ ఆసుపత్రి ఇండో యురోపియన్ శైలికి నిలువుటద్దం. హైదరాబాద్ నగరానికి పరిచయమైన పాత తరం పార్శీల్లో ఫిస్తోంజీ కుటుంబం ఒకటి. ఫిస్తోంజీ, విక్కాజీ ఇద్దరు సోదరులు బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు, వస్త్ర వ్యాపారాలు చేసేవారు. వారు కట్టించిన భవనమే ‘ఫిస్తోంజీ అండ్ కంపెనీ బిల్డింగ్’. ఇప్పటి ఈఎన్‌టీ ఆసుపత్రి. అప్పట్లో అది ఒక బ్యాంకింగ్ కంపెనీ. 1839-1845 ప్రాంతంలో బీదర్ రాజ్య ఆదాయ వ్యవహారాలను పర్యవేక్షించేది. భవనంలోని అనేక నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలు కూలిపోతున్న పరిస్థితి. పైకప్పు పెచ్చులూడిపోతోంది. బయటి గోడల్లో రావి మొక్కలు పైకి లేచాయి.  
 
ఇంకా మరెన్నో...
నగరంలో ఉన్న చారిత్రక భవనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇంకా ఎన్నో చారిత్రక కట్టడాలు శిథిలావస్థలో ఉన్నాయి. వాటిలో నిజామియా ఆబ్జర్వేటరీ, చెత్తాబజార్‌లోని దివాన్ దేవిడీ, చార్‌కమాన్, ఆలియాబాద్ సరాయి, అత్తాపూర్‌లోని ముష్క్ మహల్, ఝామ్‌సింగ్ ప్రాంతంలోని ఝాంసింగ్ టెంపుల్ గేటు, కింగ్‌కోఠి ఆసుపత్రి, మలక్‌పేట్‌లోని మహబూబ్ మాన్షన్, సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం, మొహంజాహీ మార్కెట్, మహల్ వనపర్తి, మోతిగల్లీలోని ఇవాన్-ఈ-అలీ, మహబూబ్ చౌక్‌లోని హోమియోపతిక్ హాస్పిటల్, సనత్‌నగర్‌లోని ఫకృల్‌ముల్క్ టూంబ్, బహదూర్‌పురాలోని కిషన్‌బాగ్ టెంపుల్, ఆదర్శనగర్ రిట్జ్ హోటల్, శాలిబండ శామ్‌రాజ్ భవనం గేటు, రాజ్‌భవన్ రోడ్డులోని నర్సింగ్ కాలేజ్, లక్డీకాపూల్ ఆస్మాన్ మహల్, పబ్లిక్‌గార్డెన్ మినీ బాలభవన్, గ్రీన్‌లాండ్స్ గెస్ట్‌హౌస్, బోయిగూడ కమాన్, నాంపల్లి సరాయ్, పాన్‌మండి గోడీకాఖబర్ తదితర భవనాలు శిథిలమవుతున్న జాబితాలో ఉన్నట్లు ఆర్కిటెక్ట్ నిపుణులు, చారిత్రక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు