దుర్గం.. భూతల స్వర్గం!

7 Feb, 2017 02:01 IST|Sakshi

- దుర్గం చెరువుకు సరికొత్త ముస్తాబు.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు
- సస్పెన్షన్‌ బ్రిడ్జి, ఫారెస్ట్‌ వాక్‌ వే, టెంపుల్‌ ఆఫ్‌ ట్రీస్, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌
- నేడో రేపో టెండర్లు.. సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఆరు నెలలు

కాలుష్యం కమ్ముకుని... రూపు కోల్పోయిన దుర్గం చెరువు ఇప్పుడు సరికొత్తగా ముస్తాబవుతోంది. చుట్టూ దట్టంగా పచ్చందాలు పరుచుకుని.. విహార కేంద్రంగా ఆహ్లాదాన్ని పంచనుంది. వీకెండ్‌లలో నగరవాసులకు సేద తీర్చడమే కాదు.. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్షించే సుందర వనంగా.. వినోద ఆరామంగా రూపుదిద్దుకుంటోంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ శాఖల సమన్వయంతో చెరువును ప్రక్షాళన చేసి.. ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులకు శ్రీకారం చుట్టింది.

సుందరీకరణలో భాగంగా చెరువు చుట్టూ పచ్చని అందాలతో పచ్చికమైదానాలు.. కూర్చునే వేదికలు.. యోగా ప్రదేశాలు, ఓపెన్‌ ఎయిర్‌ యాంపీ థియేటర్‌తోపాటు దట్టమైన చెట్ల మధ్య నడకకు 590 మీటర్ల మేర ఎలివేటెడ్‌ వాక్‌వే వంటి ఎన్నో ప్రత్యేకతలు సుందరీకరణలో ఉన్నాయి. ఈ పనులన్నీ పూర్తిచేసేందుకు దాదాపు మూడు నుంచి నాలుగేళ్లు... సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఆరు నెలలు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది పూర్తయిన తరువాత మొత్తం అంచనా వ్యయం ఎంతనే వివరాలు తెలుస్తాయి. పబ్లిక్, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో వివిధ ప్రభుత్వ శాఖలతోపాటు ప్రైవేటు సంస్థలు కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) కింద ఈ ప్రాజెక్టులో భాగస్వాములవుతున్నాయి.

మొదలైన చెరువు ప్రక్షాళన పనులు

దుర్గం చెరువు విస్తీర్ణం 160 ఎకరాల నుంచి దాదాపు 80 ఎకరాలకు కుంచించుకుపోయింది. బహుళ అంత స్తుల భవనాలూ వెలిశాయి. మిగిలిన ప్రదేశాన్నయినా కాపాడేందుకు ఈ ప్రాంతాన్ని ఆకర్షణీయ కేంద్రంగా, ఐటీ హబ్‌లో విహార కేంద్రంగా మార్చేందుకు ఈ భారీ ప్రణాళికలు రూపొందించారు. తొలుత చెరువును ప్రక్షాళన చేస్తారు. జీహెచ్‌ఎంసీ నీటిపారుదల విభాగంలో గుర్రపు డెక్క తొలగింపు పనులు రూ.50 లక్షలతో ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతోపాటు ఏడాది వరకు నిర్వహణను కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. 2.2 కి.మీ. మేర వాక్‌వే, సైకిల్‌ ట్రాక్‌ పనుల కోసం రూ.2 కోట్లతో టెండర్లు ఆహ్వానించను న్నారు. ఎన్‌సీసీ బిల్డింగ్‌ నుంచి దుర్గం చెరువు కట్ట వరకు వీటిని ఏర్పాటు చేస్తారు. జూన్‌ నెలాఖరుకు ఈ పనులు పూర్తవుతాయని సంబంధిత సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ శేఖర్‌రెడ్డి తెలిపారు. గుర్రపుడెక్క తొలగింపు రెండు నెలల్లో పూర్తవుతుందన్నారు.

భాగస్వామ్య సంస్థలివీ..
టీఎస్‌ ఐఐసీ, టూరిజం డెవలప్‌మెంట్, జీహెచ్‌ఎంసీ,జలమండలి, వెల్స్‌ ఫార్గో, కె.రహేజా కార్పొరేషన్‌.
ఎవరేం చేస్తారు..?
జలమండలి
20 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి కేంద్రం
జీహెచ్‌ఎంసీ
గుర్రపుడెక్క తొలగింపు, వాక్‌వే పనులు
టీఎస్‌ఐఐసీ
యాంపీ థియేటర్, బౌల్డర్‌ వాక్, రాక్‌ గార్డెన్‌

ప్రస్తుత సమాచారం మేరకు దుర్గం చెరువు చుట్టూ ఇవీ ప్రత్యేకతలు..
ప్రవేశ ద్వారం  సస్పెన్షన్‌ బ్రిడ్జి బౌల్డర్‌ వాక్‌వే (500 మీ.) వాటర్‌ఫ్రంట్‌ కేఫ్, పార్కింగ్‌ ఫారెస్ట్‌ వాక్‌ వే (590 మీ.)
సైకిల్‌ట్రాక్, ఫౌంటైన్‌ , బార్‌బీక్యూ కియోస్క్‌
ఫిషీ రెస్టారెంట్, చుట్టూ తోటలు
స్క్రీన్‌ ఆన్‌ ది గ్రీన్, టెంపుల్‌ ఆఫ్‌ ట్రీస్‌
గ్రీన్‌ ఫింగర్స్, అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌

సొరంగ మార్గం...

సస్పెన్షన్‌ బ్రిడ్జి ముగిసే ఇనార్బిట్‌ మాల్‌ దగ్గరి నుంచి ఖాజాగూడ జంక్షన్‌ వరకు మధ్యనున్న గుట్ట ప్రాంతంలో సొరంగ మార్గం ఏర్పాటు చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నాయి. తద్వారా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వైపు వెళ్లేవారికి ఎంతో సమయం కలిసి వస్తుంది.







సస్పెన్షన్‌ బ్రిడ్జి...
అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి సమీప ప్రాంతం నుంచి మాదాపూర్‌ ఇనార్బిట్‌మాల్‌ వరకు సస్పెన్షన్‌ బ్రిడ్జికి టెండర్లు పూర్తయ్యాయి. టెండరు దక్కించుకున్న సంస్థ సమగ్ర అధ్యయనాన్ని ప్రారంభించింది.దాదాపు కి.మీ. పొడవునా నిర్మించే ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే జూబ్లీహిల్స్‌ నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్‌ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పి దూరం తగ్గుతుంది. పర్యాటక కేంద్రంగానూ సందర్శకులను ఆకట్టుకుంటుంది.


ఐటీ హబ్‌ ముఖచిత్రంగా మార్చేందుకు...

గోల్కొండ కోటకు మంచినీటి సరస్సుగా ఉపయోగపడి, రహస్య చెరువుగా పేరున్న దుర్గం చెరువు సరిసరాల్ని అన్ని వయస్సుల వారినీ ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు వివిధ దేశాల్లోని చెరువులను అభివృద్ధి చేసిన తీరును అధికారులు పరిశీలించి వచ్చారు. వివిధ రకాల వృక్ష, జీవ జాతులతో జీవ వైవిధ్యాన్ని కూడా పెంపొందించేలా రకరకాల థీమ్స్‌తో సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. రాక్‌ క్లైంబింగ్, రాపెల్లింగ్‌ వంటి సాహస క్రీడలతోపాటు పిల్లలను ఆకట్టుకునే బట్టర్‌ఫ్‌లై పార్క్‌ తదితరమైనవి ప్రణాళికలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు